ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
  • జిల్లాలో 350కి పైగా హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్​ సెంటర్లు

ఖమ్మం, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్​ సెంటర్లలో అక్రమాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు టీమ్​లుగా ఏర్పడి తనిఖీలు చేస్తుంటే, ఖమ్మం జిల్లాలో ఆఫీసర్లు మాత్రం ఆ టాస్క్​ను పక్కన పెట్టేశారు. 350కి పైగా హాస్పిటళ్లు ఉన్న జిల్లాలో, మూడింటిని చెకింగ్ చేసి వదిలేశారు.  ఒకవైపు డెంగీ, విష జ్వరాల బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నస్టిక్​ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ముక్కు పిండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నా, ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

రూల్స్ కు విరుద్ధంగా సెల్లార్లలో ఎక్స్​ రే సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలను పక్కన పెట్టి ఇతర పనుల్లో బిజీగా ఉన్నామని చెబుతున్నారు. ఇటీవల ఆకస్మిక తనిఖీలో ఒక ఆసుపత్రిలో అనుమతి లేకుండా స్కానింగ్ చేసి, పాప అని తేలడంతో అబార్షన్​ చేస్తున్న విషయం బయటపడింది. ఇలాగే ఇంకా చాలా ఆసుపత్రుల్లో స్కానింగ్, అబార్షన్లు చేయడం కామన్​గా మారింది.  

ఒక్కరోజే తనిఖీలు..

ప్రైవేట్​ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాలని డీసీహెచ్​ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత సోమవారం ఒక్కరోజే రెండు ఆసుపత్రులు, మరో డయాగ్నస్టిక్​ సెంటర్ లో చెకింగ్ చేశారు. వైరా రోడ్​లోని స్వాతి ఆసుపత్రిని డీఎంహెచ్​వో డాక్టర్​ మాలతి, డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. అక్కడ పేషంట్ల తాలూకు సరైన రికార్డులు నిర్వహించకపోవటాన్ని గుర్తించారు. ఎక్కువ మంది పేషంట్లు వచ్చినా, రికార్డుల్లో తక్కువగా ఉన్నట్లు చూపించి మిగితా వారికి వేరే ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తుండటాన్ని గుర్తించారు.

ఆసుపత్రి యాజమన్యానికి నోటీసులు జారీ చేశారు. తర్వాత అపోలో డయాగ్నస్టిక్ సెంటర్​ను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బయో మెడికల్ వ్యర్ధాలు ల్యాబ్​లో పేరుకు పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లడ్​ శాంపుల్స్ నిల్వ ఉండడంపై యాజమాన్యాన్ని ప్రశ్నించి ల్యాబ్​ను సీజ్ చేశారు. అదే ప్రాంతంలో అనుమతులు లేకుండా నడుపుతున్న మరో డెంటల్​ హాస్పిటల్​ను సీజ్ చేశారు.

బిజీగా ఉండడంతోనే..

ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లపై తనిఖీలు రెగ్యులర్​ గా కొనసాగుతాయని, ప్రస్తుతం బిజీగా ఉండడం వల్ల చెకింగ్స్ చేయడం లేదు. చెకింగ్స్ ప్రారంభమైన సమయంలో తాను వ్యక్తిగత కారణాలతో రెండ్రోజులు సెలవులో ఉన్నాను. సోమవారం తనిఖీలు చేశాం. మంగళవారం దిశ కమిటీ మీటింగ్ ఉండడం, ఆ తర్వాత బతుకమ్మ, ఇతర కార్యక్రమాల వల్ల తనిఖీలు చేయలేదు. - మాలతి, డీఎంహెచ్​వో, ఖమ్మం

నిబంధనలు పాటిస్తలేరు..

అధికారుల రికార్డుల ప్రకారం జిల్లాలో 320కి పైగా ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ప్రైవేట్ ల్యాబ్​లు ఉన్నాయి. అనధికారికంగా పదుల సంఖ్యలోనే ఆసుపత్రులున్నాయి. అనుమతుల కోసం అప్లై చేసుకున్న తర్వాత పర్మిషన్లు రాకుండానే ఆసుపత్రులు తెరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. చాలా ఆసుపత్రుల ముందు బోర్డులో చాలా మంది కన్సల్టెంట్ డాక్టర్ల పేర్లున్నా  ఒకరిద్దరితోనే నిర్వహిస్తున్నారు. ఆస్పత్రుల్లోని సెల్లార్లలో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా పార్కింగ్ కోసమే వాడాలని నిబంధనలు ఉన్నా, వాటిలోనే ఎక్స్ రే సెంటర్లను నిర్వహిస్తున్నారు.

ఇటీవల మున్సిపల్ అధికారులు ఒక ఆసుపత్రిలోని సెల్లార్​లో కట్టిన రూమ్​ కూల్చివేసి, మిగిలిన వాటిని పట్టించుకోలేదు. అయితే ఈ విషయం తెలిసినా, వైద్యారోగ్య శాఖ అధికారులు సైలెంట్ గా ఉండడానికి మామూళ్లే కారణమన్న ఆరోపణలున్నాయి. డీఎంహెచ్​వో ఆఫీస్​లోని ఒక అధికారి  నెలవారీగా ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ, అందరినీ మేనేజ్​ చేస్తున్నారన్న కంప్లైంట్స్ ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి ఒక బ్లడ్​ బ్యాంక్​ను సెల్లార్​ లోనే నిర్వహిస్తుండగా, ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

విజయలక్ష్మిగా లక్ష్మీతాయారు అమ్మవారు

భద్రాచలం/పాల్వంచ,వెలుగు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో లక్ష్మీతాయారు అమ్మవారు శనివారం విజయలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం భద్రుని మండపంలో రామపాదుకలకు పంచామృతాలతో అభిషేకం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామికి గర్భగుడిలో సువర్ణ తులసీదళాలతో అర్చన జరిపించారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి మూలమూర్తికి అభిషేకం చేసి, ఉత్సవమూర్తిని విజయలక్ష్మిగా అలంకరించారు.

అమ్మవారికి భక్తులు కుంకుమార్చన చేశారు. లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ప్రాకార మండపంలో రామయ్యకు నిత్య కల్యాణం జరగగా, చిత్రకూట మండపంలో శ్రీమద్రామాయణ సుందరకాండను భక్తులు పారాయణం చేశారు. పాల్వంచలోని పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారిని లలితా పరమేశ్వరిదేవిగా అలంకరించారు. ఆలయంలో రుద్రాభిషేకం, రుద్ర హోమం, శ్రీ చక్రార్చన, సూర్య నమస్కారాలు, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ సదాశివకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

యువత మంచి మార్గంలో నడవాలి

వైరా, వెలుగు: యువత చెడు మార్గానికి దూరంగా ఉండాలని ఏసీపీ రెహమాన్​ సూచించారు. శనివారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్​ వంటి మారకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను ఆగం చేసుకోవద్దని సూచించారు. మైనర్లకు బైక్స్​ ఇస్తే కేసులు పెడతామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సరైన పత్రాలు లేని బైకులు, ఆటోలు, వాహనాలకు చలాన్లు విధించారు. సీఐ టి సురేశ్, ఎస్సైలు వీరప్రసాద్,  యయాతి రాజు, సురేశ్​​పాల్గొన్నారు. 

దేవీ మండపాల్లో బీజేపీ నేత పూజలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దేశ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని రామవరంలో ఏర్పాటు చేసిన పలు దేవీ మండపాలను ఆయన సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నైతిక విలువలు పెంపొందించాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఉమ్మడి కుటుంబంలో ఆనందం, సందడి ఉంటుందని అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు అన్నారు. చుంచుపల్లి మండలంలో వెల్ఫేర్​ ఆఫీసర్​ ఆర్  వరలక్ష్మి అధ్యక్షతన శనివారం అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పెద్దలను పట్టించుకోకపోవడంతో ఎంతో మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉమ్మడి కుటుంబాలతో కలిగే లాభాలు, పెద్దల పట్ల గౌరవభావం పెంపొందించేలా నీతి కథలను చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

నైతిక విలువలు పెంచేందుకు టీచర్లతో పాటు పేరెంట్స్​ తమవంతు కృషి చేయాలన్నారు. అనంతరం 90 ఏండ్లు దాటిన ఓటర్లను సన్మానించారు. వృద్ధులకు ఆటల పోటీలు నిర్వహించారు. డీఆర్​డీఏ ఏపీడీ​ఆర్ సుబ్రహ్మణ్యం, తెలంగాణ సీనియర్​​ సిటిజెన్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ కె. నాగేశ్వరరావు, సెక్రటరీ సురేశ్, సీనియర్​ సిటిజన్స్​ వేములపల్లి నాగభూషణమ్మ, ఆదెమ్మ, మరియమ్మ, పాండురంగారావు, కేశవరావు, వరప్రసాద్​ పాల్గొన్నారు. 

యువతి మిస్సింగ్

అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని మామిళ్లవారి గూడెం గ్రామానికి చెందిన 19 ఏండ్ల యువతి తప్పిపోయినట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిశోర్​రెడ్డి తెలిపారు. గత నెల 29 నుంచి యువతి కనిపించకపోవడంతో స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. యువతి తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  చేశాడు.

స్వచ్ఛ సర్వేక్షన్​లో 11వ ర్యాంకు

పాల్వంచ,వెలుగు: స్వచ్ఛ సర్వేక్షన్ అర్బన్ అవార్డుల్లో ఈ ఏడాది పాల్వంచ మున్సిపాలిటీకి  జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు వచ్చింది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో సౌత్ ఇండియా స్థాయిలో ఈ ర్యాంకు లభించడం పట్ల మున్సిపల్​ కమిషనర్ చింత శ్రీకాంత్  హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

ఖమ్మం టౌన్, వెలుగు: ఆర్వోఎఫ్ఆర్ చట్టంపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. శనివారం డీపీఆర్సీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎఫ్ఆర్వోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలోని 94 గ్రామ పంచాయతీల్లో 42,409 ఎకరాలకు సంబంధించి 18,295 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వీటి సర్వే కోసం48 టీమ్​లను ఏర్పాటు చేశామని తెలిపారు.

దరఖాస్తుల విచారణ అనంతరం గ్రామసభ తీర్మానం చేసి, డివిజన్ స్థాయి కమిటీకి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, అడిషనల్​ కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్  మధుసూదన్ పాల్గొన్నారు. అనంతరం ఖమ్మం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్​ అప్రూవల్​ కమిటీ సమావేశం నిర్వహించి 14 దరఖాస్తులను పరిశీలించారు. నిబంధనల మేరకు ఉన్న 8 దరఖాస్తులకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్​ కలెక్టర్  స్నేహలత పాల్గొన్నారు. 

తప్పులు లేకుండా సర్వే చేయాలి

భద్రాచలం: అటవీహక్కు చట్టం నిబంధనల ప్రకారం గ్రామాల్లో సర్వే చేసి పోడు భూముల దరఖాస్తులు తప్పులు లేకుండా విచారణ చేయాలని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం ఆయన తన కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎఫ్ఆర్వోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీహక్కుల చట్టంపై రివ్యూ చేశారు. నవంబరు 2021లో ఆర్ఎఫ్ఆర్​ ద్వారా పోడు భూములకు వచ్చిన దరఖాస్తుల విచారణలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆఫీసర్లకు వివరించారు. సోమవారం నుంచి సర్వే చేసి రిపోర్టులు అందజేయాలన్నారు. ఏ ఒక్క గిరిజనుడు నష్టపోకుండా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత, డీఆర్వో అశోక చక్రవర్తి పాల్గొన్నారు.

‘ప్రాథమిక చికిత్సలే చేయాలి’

చండ్రుగొండ, వెలుగు: పరిధికి మించి వైద్యం చేసి పేషెంట్ల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని మెడికల్ ఆఫీసర్ వెంకట ప్రకాశ్ ఆర్ఎంపీ వైద్యులను హెచ్చరించారు. శనివారం పీహెచ్ సీ లో ఆర్ఎంపీ వైద్యులతో సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లను ప్రాథమిక చికిత్సా కేంద్రంలో కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో రెండు రోజులుగా జ్వరంతో బాధపడే పేషెంట్ల సమాచారం ఏఎన్ఎం, పీహెచ్ సీ సిబ్బందికి ఇవ్వాలని అన్నారు. పేషెంట్ల వివరాలను రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. 

నేరస్థులకు శిక్షపడేలా చూడాలి

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: నేరస్థులకు కోర్టులలో శిక్ష పడేలా చేయడమే లక్ష్యంగా కోర్టు డ్యూటీ ఆఫీసర్లు పని చేయాలని పోలీస్​ కమిషనర్​ విష్ణు ఎస్​ వారియర్​ సూచించారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో పోలీస్​ కాన్ఫరెన్స్​ హాల్​లో శనివారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్​ నమోదు నుంచి నిందితుల అరెస్ట్, కేసు దర్యాప్తు, చార్జ్​షీట్​ దాఖలు వరకు అలర్ట్​గా ఉండాలని అన్నారు. పబ్లిక్​ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నేర నిరూపణ, శిక్ష ఖరారు తగ్గితే ఆ ప్రభావం ప్రజల భద్రత, రక్షణపై పడుతుందని అన్నారు. జిల్లాలో 55 శాతం శిక్షలు ఖరారు అవుతున్నాయని, మరిన్ని కేసుల్లో శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ఏసీపీలు, సీఐలు, ఎస్​హెచ్​వోలు కోర్టు కేసులపై రోజువారీగా సమీక్షించాలని ఆదేశించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 13 మంది కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు క్యాష్​ రివార్డులను అందజేశారు. ఏడీసీపీ(అడ్మిన్)​ డాక్టర్​ శబరీశ్, ఏసీపీ ప్రసన్నకుమార్​ పాల్గొన్నారు.

నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి

భద్రాచలం, వెలుగు: నష్టపరిహారం అందని వరద బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని సీపీఎం పట్టణ కమిటీ నాయకులు శనివారం భద్రాచలం తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నష్టపరిహారం పొందిన వారి లిస్టును బహిర్గతం చేయాలని డిమాండ్​ చేశారు. పరిహారం ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టౌన్​ సెక్రటరీ గడ్డం స్వామి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, బండారు శరత్​బాబు ఉన్నారు.

అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

ఖమ్మం/కల్లూరు, వెలుగు: ఖమ్మం సిటీలోని సర్దార్ పటేల్  స్టేడియంలో టీఎన్జీవోస్  ఆధ్వర్యంలో శనివారం వేపకాయ బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన సతీమణి వసంతలక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్  వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్  వారియర్, నగర మేయర్  నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పాల్గొన్నారు. కల్లూరు మండలకేంద్రంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని సందడి చేశారు.

‘తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ’

ఖమ్మం టౌన్, వెలుగు: తెలంగాణా సంస్కృతి కి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. ఆర్జేసీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. కాలేజీ  చైర్మన్ గుండాల కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్  నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ప్రిన్సిపాల్  ఎం.శివకుమార్, వైస్  ప్రిన్సిపాల్  ఎ లింగయ్య, సైన్స్ ఇన్​చార్జి ఉపేందర్, కార్పొరేటర్ కన్నంవైష్ణవి ప్రసన్న కృష్ణ, జి కవిత, ఆర్  కవిత, వై లక్ష్మి పాల్గొన్నారు.

సీనియర్​ ఓటరుకు సన్మానం

అన్నపురెడ్డిపల్లి,వెలుగు: వందేండ్లు నిండిన బూరుగూడెం గ్రామానికి చెందిన షేక్  లాల్అహ్మద్  అనే ఓటరును శనివారం రెవెన్యూ సిబ్బంది సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఆర్ఐ మధు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన్రు

భద్రాచలం, వెలుగు: నాసిరకం బతుకమ్మ చీరలు పంపిణీ చేసి టీఆర్ఎస్  సర్కారు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని బీఎస్పీ టౌన్  ప్రెసిడెంట్​ గడ్డం సుధాకర్​ విమర్శించారు. టౌన్​ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో శనివారం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరల పేరుతో రూ.1300 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. నాసిరకం చీరలను మహిళలు తీసుకోకపోవడంతో గోదాముల్లోనే మూలుగుతున్నాయని తెలిపారు. 

కనీస వేతనాల జీవో సవరించాలి

భద్రాచలం, వెలుగు: రాష్ట్రంలో 76 రకాల షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను సవరించి కొత్త జీవోలను విడుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు డిమాండ్​ చేశారు. భద్రాచలంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, యాజమాన్యాలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్మికులకు చట్టబద్ధంగా రావాల్సిన వేతనాల జీవోలు ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతోందని అన్నారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు అప్పారావు, కార్యదర్శి ఏజే రమేశ్, ఆఫీస్​ బేరర్స్ జి.పద్మ, బ్రహ్మాచారి,ఈసం వెంకటమ్మ పాల్గొన్నారు.

పలువురికి పొంగులేటి పరామర్శ

కారేపల్లి,వెలుగు: మండలంలోని వివిధ గ్రామాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. మండలంలోని 21 గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందించారు. మార్క్​ఫెడ్​ స్టేట్​ వైస్​చైర్మన్​ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్​ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, నర్సింగ్​ శ్రీనివాస్, అజ్మీరా నరేశ్, బానోత్​ పద్మావతి, మల్లెల నాగేశ్వరరావు పాల్గొన్నారు.