ఆలిండియా కోటా కౌన్సెలింగ్​పై ఎంసీసీ ఉత్తర్వులు

ఆలిండియా కోటా కౌన్సెలింగ్​పై ఎంసీసీ ఉత్తర్వులు

హైదరాబాద్​, వెలుగు: మెడికల్​ పీజీ సీట్ల భర్తీకి చేపట్టిన ఆలిండియా కోటా మాపప్​ రౌండ్​ను మెడికల్​ కౌన్సెలింగ్​ కమిటీ (ఎంసీసీ) రద్దు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు సూచనల మేరకు తాజాగా మాపప్​ కౌన్సెలింగ్​ చేసేందుకు నిర్ణయించింది. రాష్ట్ర కౌన్సెలింగ్​లో పీజీ సీట్లు పొందిన స్టూడెంట్లు మాపప్​ కౌన్సెలింగ్​లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించింది. ఎంసీసీ నిర్ణయంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. మంచి కాలేజీలో సీటు కోసం కొందరు స్టూడెంట్లు స్టేట్​ కౌన్సెలింగ్​లో వచ్చిన సీట్లను వదులుకుని మాపప్​ కౌన్సెలింగ్​లో పాల్గొన్నారు. సీటు వచ్చి కాలేజీల్లో కూడా చేరిపోయారు. ఇప్పుడు ఉన్నపళంగా కౌన్సెలింగ్​ రద్దు చేయడం, మళ్లీ తాజాగా నిర్వహించే కౌన్సెలింగ్​లో పాల్గొనేందుకు అనర్హులని ప్రకటించడంతో తమ భవిష్యత్​ ఏంటని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఆలిండియా కోటా మాపప్​ రౌండ్​ తర్వాత స్టేట్​ కోటా మాపప్​ రౌండ్​ కౌన్సెలింగ్​ నిర్వహిస్తారు. దీని వల్ల ఆలిండియా కోటాలో సీటు రాని వాళ్లు.. స్టేట్​ కోటా చివరి రౌండ్​లో పాల్గొని సీటు పొందే అవకాశం ఉంటుంది. ఈసారి కూడా అలాగే చేశారు. ఆలిండియా కోటా చివరి రౌండ్​ కౌన్సెలింగ్​ అవ్వగానే, స్టేట్​ కోటా చివరి రౌండ్​ నిర్వహించారు. అయితే, ఇప్పుడు ఆలిండియా కోటా చివరి రౌండ్​ కౌన్సెలింగ్​ను ఎంసీసీ రద్దు చేసింది. ఎంసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థుల్లోనూ భయం పట్టుకుంది. దీంతో కర్నాటక ప్రభుత్వం స్టేట్​ కోటా చివరి రౌండ్​ కౌన్సెలింగ్​ను రద్దు చేసింది. ఆలిండియా కోటా చివరి రౌండ్​ కౌన్సెలింగ్​ పూర్తయ్యాక, స్టేట్​ కోటా నిర్వహిస్తామని ప్రకటించింది. మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని మెడికోలు కోరుతున్నారు. ఇదే విషయంపై కాళోజీ హెల్త్​ యూనివర్సిటీ వీసీ, రిజిస్ర్టార్​‌‌‌‌‌‌‌‌లను ఫోన్​లో సంప్రదించగా, వారు స్పందించలేదు.