వరంగల్ ఎంజీఎంల మందుల దందా

వరంగల్ ఎంజీఎంల మందుల దందా

వరంగల్‍, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే ఎంజీఎం హస్పిటల్​ కేంద్రంగా మందుల దందా నడుస్తున్నది. కొందరు రూలింగ్ ​పార్టీ లీడర్లు ప్రైవేట్‍ మెడికల్‍ ఏజెన్సీలతో కుమ్మక్కై మెడికల్​ మాఫియాగా అవతారమెత్తారు. ఎంజీఎం, సెంట్రల్​ మెడికల్​ స్టోర్​లోని కొందరు ఆఫీసర్లు, ఎంజీఎం స్టోర్స్​లోని సిబ్బందితో కుమ్మక్కై కోట్లలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. అవసరానికి మించి స్టాక్​ తెప్పించుడు, ఎక్స్​పైరీ అయినంక కాలబెట్టుడు, కోట్ల ఖర్చుతో మళ్లీ కొత్త స్టాక్‍ తెప్పించుడు,  ఎమర్జెన్సీ కింద 20 శాతం మెడిసిన్​తమకు కావాల్సిన కంపెనీలవి తెప్పించడం, కమీషన్లిచ్చే కంపెనీల మందులను పేషెంట్లకు రాసి బయటి నుంచి తెచ్చుకునేలా ఒత్తిడి చేసుడు... ఈ రకంగా దందా నడుస్తోంది. గతంలో ఎక్స్​పైరీ అయిన రూ.4.5 కోట్ల విలువైన మందులను కాల్చేసిన విషయం 2019లో వెలుగు చూసింది. ఇద్దరు, ముగ్గురు సిబ్బందిపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. తాజాగా మరో రూ.1.5 కోట్ల విలువైన మందులు ఎక్స్​పైర్​ అయ్యాయని సిబ్బంది తేల్చారు. వాటిని కాలబెట్టేందుకు సూపరింటెండెంట్​ను పర్మిషన్​ అడిగారు. దీనిపై ఆయన ఎంక్వైరీకి ఆదేశిస్తే పొలటికల్ ​ప్రెజర్​తో అడ్డుకుంటున్నరు!

అవసరం లేకున్నా మూడింతల స్టాకు

ప్రైవేట్‍ మెడికల్​ఏజెన్సీలతో మాఫియా చేతులు కలిపింది. ఎంజీఎం, సెంట్రల్‍ మెడికల్‍ స్టోర్​లోని కొందరు ఆఫీసర్లు, స్టాఫ్​ సాయంతో ఎంజీఎంకు అవసరమున్నా లేకున్నా మందులు అంటగడుతోంది. ఏటా అవసరమయ్యే మందుల కంటే రెండు, మూడింతలు ఎక్కువ స్టాక్‍ తెచ్చి పెడుతున్నారు. తామనుకున్న కంపెనీల మందులే ఉండేలా చూసుకుంటున్నారు. తెచ్చిన మందులు వాడకుంటే ఎక్స్​పైరీకి కొద్ది నెలల ముందు రిటర్న్​ చేసే అవకాశమున్నా చెప్పడం లేదు. ఎంజీఎంలో 2016–2019 దాకా ప్రముఖ కంపెనీ నుంచి రూ.13.22 కోట్ల మందులు, సర్జికల్‍ కిట్లు తెప్పించారు. చివరికి రూ.4.5 కోట్ల మందులు ఎక్స్​పైరీ అయ్యాయి. రూ.6.22 కోట్ల విలైన మందులు అట్ట పెట్టల్లోనే మగ్గిపోయాయి. ఇందులో ఎంజీఎం, ఎస్​ఎంఎస్​కు చెందిన పెద్దాఫీసర్ల పాత్ర ఉందని ఆరోపణలొచ్చినా ముగ్గురు, నలుగురు సిబ్బందిపై చర్యలతో సరిపెట్టారు. వారిలోనూ ఇద్దరిని ఆర్నెల్లలో మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు!

సగం మందులు బయట్నించి కొంటరట!

ఎంజీఎం అవసరమైన మందుల్లో 80% సెంట్రల్‍ మెడికల్‍ స్టోర్‍ నుంచి తెప్పించుకోవాలి. 20% ఎమర్జెన్సీ కింద లోకల్‍గా అధికారులు కొనుగోలు చేయొచ్చు. 2019లో అక్రమాలు బయటపడడంతో ఎస్​ఎంఎస్​ నుంచి అవసరాన్ని బట్టి మందులు తెచ్చుకోవాలని ఆఫీసర్లు కండీషన్ ​పెట్టారు. దీంతో తెరవెనుక చక్రం తిప్పుతున్న మెడికల్​ మాఫియా అక్రమ ఆఫీసర్ల సాయంతో ఎంజీఎంలో కృత్రిమ కొరత సృష్టించి లోకల్‍గా 20% బదులు 50% తెచ్చుకునే చాన్స్ కోసం సూపరింటెండెంట్​పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. 

కొత్తగా రూ.కోటిన్నర మందులు ఎక్స్​పైరీ 

4 నెలల కింద ఎంజీఎంకు కొందరు ఆఫీసర్లు కొత్తగా వచ్చారు. రూ.కోటిన్నర విలువైన మందులు ఎక్స్​పైరీ అయ్యాయని తేల్చారు. వాటిని కాలబెట్టడానికి సూపరింటెండెంట్‍ చంద్రశేఖర్​ను పర్మిషన్‍ అడిగారు. దీనిపై కంగుతిన్న ఆయన ‘‘అసలు ఆ మందులేంటి? ఎప్పుడు, ఎవరి హయంలో తెప్పించారు? ఇన్నాళ్లు ఎందుకు వాడలేదు? దీనికి బాధ్యులెవరు?” ఇవన్నీ తేల్చాలంటూ కమిటీ వేశారు. తమపై ఒత్తిళ్లు వస్తున్నాయని, విచారణ చేయలేమని వారం రోజులకే ఆ కమిటీ సభ్యులు చేతులెత్తేశారు. కొత్త కమిటీ వేయాలని చూస్తున్నా ఎవరూ ముందుకు రావట్లేదు.

చర్యలు తీసుకుంటాం

ఎంజీఎంలో భారీగా మందులు ఎక్స్​పైర్ అయ్యాయి. దీనిపై ఎంక్వైరీకి కమిటీ వేస్తే వ్యక్తిగత కారణాలు చూపుతూ మెంబర్లు తప్పుకున్నారు. త్వరలో కొత్త కమిటీ వేస్తాం. బాధ్యులపై యాక్షన్‍ తీసుకుంటాం. 
-  డాక్టర్ వి.చంద్రశేఖర్‍, ఎంజీఎం సూపరింటెండెంట్‍

కిట్లు, మందులు బయటికే రాసిన్రు 

మా చుట్టాలకు జ్వరమొస్తే ఎంజీఎం తీసుకొచ్చినం. రెండు, మూడు రకాల టెస్టులు చేయాలన్నరు. కిట్లు, యాంటీబయాటిక్‍ మందులు ఆస్పత్రిల లేవని చెప్పి చీటీ రాసిచ్చిన్రు. బయటి మెడికల్ షాపుల్నే దొరుకుతయని చెప్పిన్రు. అవే తెచ్చి వెయ్యాల్సొచ్చింది. 
- కె.అశోక్‍, పరకాల