హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణ చారి ఆధ్వర్యంలో ప్రతినిధులు శుక్రవారం సీఎం ప్రజావాణిలో నోడల్ ఆఫీసర్ కే.విద్యాసాగర్ కు వినతిపత్రం ఇచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ బాలికల హాస్టల్ లో నీటి సమస్యతో పాటు ఫ్యాకల్టీ, హెచ్ఓడీల కొరత ఉందని తెలిపారు. జగిత్యాల కాలేజీలో ఫస్ట్ ఇయర్ తరగతుల ప్రారంభ జాప్యం, జనగాం కాలేజీలో ప్రత్యక్ష తరగతుల నిర్లక్ష్యాన్ని వివరించారు.
ఆసిఫాబాద్ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, మహేశ్వరం కాలేజీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అన్ని కాలేజీల్లో ఖాళీ ప్రొఫెసర్ పోస్టుల భర్తీతో పాటు తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, హాస్టళ్లలో వసతులు కల్పించాలన్నారు. హాస్టళ్లలో గీజర్లు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులు, ప్రాక్టికల్స్, క్లినికల్ పోస్టింగ్‌లు సక్రమంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వీరి సమస్యలపై నోడల్ అధికారి విద్యాసాగర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ప్రతినిధులు డీఎంఈ కార్యాలయంలోనూ అధికారులకు సమస్యలు వివరించారు.
