
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెడికల్ వేస్ట్ ఏటేటా పెరిగిపోతోంది. వాటి నిర్వహణ, ప్లాంట్లకు తరలింపుల్లో కొన్ని హాస్పిటళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లను కలిపితే రోజూ 16 టన్నులకుపైనే మెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. 2017లో 3,039 హాస్పిటళ్ల నుంచి రోజూ సగటున 15.719 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తయితే 2018లో 16.243 టన్నులకు పెరిగింది. వాటిలో సెలైన్ బాటిళ్లు, సిరంజీలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వాటిని సరిగ్గా డిస్పోజ్ చేయట్లేదని, ప్లాంట్లకు తరలించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు తెలంగాణ పొల్యూషన్ బోర్డు గుర్తించింది. నిబంధనలు పాటించని 10 ఆస్పత్రులకు నోటీసులిచ్చింది.
11 చోట్ల ట్రీట్మెంట్ ప్లాంట్లు
ఆస్పత్రుల నుంచి నాలుగు రకాల వ్యర్థాలు వెలువడుతున్నాయి. వీటిలో బ్లూ కేటగిరీకి చెందిన డిస్పోజబుల్ సెలైన్ బాటిళ్లు ఎక్కువైనట్టు పీసీబీ గుర్తించింది. 2017లో రోజుకు 96 కిలోలు ఉత్పత్తి అయితే, 2018లో 807 కిలోలకు పెరిగింది. ఎల్లో కేటగిరీలోని ఇన్ఫెక్షన్ ఉన్న అవయవాలు, బొడ్డు పేగులు, రక్తంతో తడిసిన వస్తువులు, బ్యాండేజీలు, కాటన్ వంటివి ఉంటాయి. ఆయా వేస్ట్‌ను వేరు చేయాల్సి ఉంటుంది. 2017లో ఇవి రోజుకు 9.899 టన్నులు ఉత్పత్తి అయితే, 2018లో 11.035 టన్నులకు పెరిగింది. ఈ వ్యర్థాలన్నింటినీ కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ప్లాంట్లకు తరలించాల్సి ఉంటుంది. ఆ ప్లాంట్లకు వచ్చే వ్యర్థాలను 800 డిగ్రీల వేడిలో కాల్చేస్తారు. కొన్నింటిని పూడ్చిపెడతారు. ఇలాంటి మెడిక్లీన్ ప్లాంట్లు 11 చోట్ల ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్లాంట్లు, ఉమ్మడి జిల్లాల పరిధిలో మరో 8 ఉన్నాయి. అయితే కొన్ని హాస్పిటళ్లను వ్యర్థాలను వేరు చేయకుండా ఒకే సంచిలో వేసి ప్లాంట్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
10 హాస్పిటళ్లకు పీసీబీ నోటీసులు
రాష్ట్రంలో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించని 10 ఆస్పత్రులను పీసీబీ విచారించనుంది. పేస్ హాస్పిటల్ (బేగంపేట), విశ్వాస్ హాస్పిటల్ (చంపాపేట), నవోదయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మహబూబ్‌నగర్), అపోలో రీచ్ హాస్పిటల్అండ్ సేఫ్లైఫ్ హాస్పిటల్(కరీంనగర్), ప్రసాద్ హాస్పిటల్(కాజీపేట), వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (వరంగల్), వాసవి హాస్పిటల్ (హన్మకొండ), ఆరోగ్య మాతా హాస్పిటల్ (జనగామ), ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(నిర్మల్), మెడిలైఫ్ స్పెషాలిటీ హాస్పిటల్ (బెల్లంపల్లి)కి అధికారులు నోటీసులిచ్చారు. వచ్చే రెండు నెలల్లో నిబంధనలు పాటించకపోతే హాస్పిటళ్లను మూసేస్తామని హెచ్చరించారు.