బీపీ, షుగర్ ఉన్నోళ్లకు మెడిసిన్ కిట్లు

బీపీ, షుగర్ ఉన్నోళ్లకు మెడిసిన్ కిట్లు
  • వచ్చే నెలలో పంపిణీకి ఏర్పాట్లు చేయాలె: మంత్రి హరీశ్
  • గాంధీలో రెండు వారాల్లో క్యాథ్​ల్యాబ్స్ ఏర్పాటు చేస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: బీపీ, షుగర్ పేషెంట్లకు జనవరి నుంచి మెడిసిన్ కిట్లు ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో చేసిన నాన్‌కమ్యూనికెబుల్ డిసీజెస్ సర్వేలో దాదాపు 7 లక్షల మంది షుగర్ పేషెంట్లు, 20 లక్షల మంది బీపీ రోగులను గుర్తించారు. ఈ సర్వే ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే గుర్తించిన రోగులకు మెడిసిన్ కిట్లను అందజేయాలని మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. ఈ కిట్లను ఆయన శనివారం పరిశీలించారు. కిట్ల డిజైన్లను ఫైనల్ చేసిన మంత్రి, డిసెంబర్ లేదా జనవరి నుంచి పంపిణీకి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కిట్‌‌‌‌కు ఓ వైపు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌‌‌‌ బొమ్మ, తెలంగాణ ప్రభుత్వ లోగోను ముద్రించారు. బీపీ, షుగర్ లక్షణాలు, వాటి వల్ల నష్టాలు, రోగాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరోవైపు ప్రింట్ చేశారు. కిట్ లోపల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకోవాల్సిన మందులను వేర్వేరు ప్యాకెట్లలో ఉంచారు.

వెనకబడిన జిల్లాలపై ఫోకస్ పెట్టాలె
గాంధీ, ఉస్మానియా దవాఖాన్లలో 2 వారాల్లోగా క్యాథల్యాబ్స్‌‌‌‌ను అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీశ్‌‌‌‌ ప్రకటించారు. నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో ఖమ్మం జిల్లా హాస్పిటల్‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్న క్యాథల్యాబ్‌‌‌‌ పనులను రెండు వారాల్లోగా పూర్తి చేయాలన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద చేపడుతున్న కార్యక్రమాలపై కోఠిలోని స్టేట్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ఆఫీసులో ఆయన శనివారం రివ్యూ చేశారు. దేశంలోని అన్ని హెల్త్ ఇండెక్స్‌‌‌‌లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండేలా పనిచేయాలని హరీశ్‌‌‌‌ అన్నారు. హెల్త్ పరంగా వెనుకబడిన జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ప్రతి ప్రోగ్రామ్‌‌‌‌పై మంత్లీ రిపోర్ట్‌‌‌‌లు తయారు చేయాలని, ప్రతి నెలా ఆ రిపోర్టులను సమీక్షిస్తానని అధికారులకు తెలిపారు. డెంగీ, మలేరియా వంటి రోగాల నివారణ, రక్తహీనత సమస్యను అధిగమించడం, వంద శాతం డెలివరీలు సర్కారు దవాఖాన్లలోనే జరిగేలా చూడడం, హాస్పిటల్స్‌‌‌‌లో శానిటేషన్‌‌‌‌, పల్లె దవాఖాన్ల ఏర్పాటు, టీ డయాగ్నస్టిక్ సేవల్లో నాణ్యత తదితర అంశాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రసూతి మరణాల సంఖ్య తగ్గించే విషయంలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నామని, మొదటి స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను హెల్త్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్‌‌‌‌ఎంఐఎస్‌‌‌‌) పోర్టల్‌‌‌‌లో అప్‌‌‌‌డేట్ చేయాలని సూచించారు.