
ఆమె గొంతు ఒక అద్భుతం. వెంటవెంటనే ఆడ గొంతు నుంచి మగ గొంతుకు, మగ గొంతు నుంచి ఆడ గొంతుకు మార్చగలదు. సెలబ్రెటీ వాయిస్‌లను కూడా వెంటవెంటనే మారుస్తూ మాట్లాడగలదు, పాడగలదు. నాలుగు సెకన్లకు ఒక గొంతు మారుస్తూ.. కేవలం 4 నిమిషాల్లో 51 మంది సెలబ్రెటీల గొంతులను మిమిక్రీ చేసి ఔరా అనిపించింది మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్న అఖిల. ఈ మధ్య మలయాళ టీవీ చానల్లో ప్రసారమైన ఓ షోలో అఖిల ఈ ఫీట్‌ను చేసింది.
ఆయుర్వేద మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నఅఖిలకు చిన్నప్పటినుంచి మిమిక్రీ చేయడమంటే ఎంతో ఇష్టం. అఖిల తిరువనంతపురం జిల్లాలోని నెదుమంగడ్‌కు చెందినది. ఆమె నెదుమంగడ్‌లోని హెచ్‌ఎస్‌ఎస్ బాలికల పాఠశాలలో చదువుకుంది. ఆమె చదువుకున్న స్కూళ్లో వార్షికోత్సవం సందర్భంగా ఎవరూ మిమిక్రీ చేయడానికి ముందుకు రాకపోవడంతో.. అఖిల తన టీచర్ల వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ అందరినీ ఆకర్షించింది. అప్పుడు టీచర్ల నుంచి వచ్చిన ప్రోత్సాహంతో ఆమె మిమిక్రీపై మరింత శ్రద్ధ పెట్టింది. తనకు మిమిక్రీ నేర్చకోమని ఎవరూ చెప్పలేదని, స్వయంగా తనకున్న ఆసక్తితోనే నేర్చుకున్నానని అఖిల చెప్పింది. మొదట తాను జంతువుల శబ్దాలు మిమిక్రీ చేసేదాన్నని అఖిల తెలిపింది. ఆ తర్వాత తాను మొదటగా మిమిక్రీ చేసింది గాయకురాలు జానకమ్మదని ఆమె తెలిపింది. జానకమ్మ పాడిన ‘అజకాదల్’ పాటతో మిమిక్రీ చేసినట్లు అఖిల తెలిపింది. అఖిల చాలా సందర్భాల్లో నటులు ఆసిఫ్ అలీ మరియు రంజిని హరిదాస్ వాయిస్‌లను మిమిక్రీ చేసినట్లు, ఆ విషయం వారిద్దరికి తెలిసి తనను మెచ్చకుంటూ ఎంతో సంతోషించారని ఆమె తెలిపింది.
అఖిల టీవీ షోలో.. రంజిని, నటుడు కమల్ హాసన్, పోక్కలం వరవాయ్ చిత్రంలో బేబీ షాలిని వాయిస్, రాజకీయ నాయకులు వీ.ఎస్.అచ్యుతానందన్, ఉమెన్ చాందీ, మరియు సినిమా థియేటర్లలో వచ్చే ధూమపాన వ్యతిరేక ప్రకటనల వాయిస్ చెప్పిన గోపన్ నాయర్‌లతో పాటూ ఇంకా చాలా మంది ప్రముఖుల వాయిస్‌లు మిమిక్రీ చేసి అందరినీ ఆకర్షించింది. గోపన్ నాయర్ యొక్క ధూమపాన వ్యతిరేక ప్రకటన కోసం అఖిల తన గొంతుతో సొంతంగా సంగీతాన్ని కూడా సమకూర్చింది. అంతేకాకుండా.. అమెరికన్ సింగర్ మైఖేల్ జాక్సన్ యొక్క ‘డేంజరస్’ ను కూడా మిమిక్రీ చేయగలదు. ఈ షోతో కేరళ నుండి వచ్చిన మొదటి లేడీ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా అఖిల పేరుగాంచింది.