పేషెంట్​కు సర్జరీ చేసి రాళ్లు తొలగించిన మెడికవర్ డాక్టర్లు

పేషెంట్​కు సర్జరీ చేసి రాళ్లు తొలగించిన మెడికవర్ డాక్టర్లు

మాదాపూర్​, వెలుగు : ఓ వ్యక్తి  కాలేయం, గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో ఉన్న వెయ్యికి పైగా రాళ్లను మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ చేసి విజయవంతంగా తొలగించారు. మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలను  మెడికవర్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ అండ్ హెపాటో ప్యాంక్రియాటో బిలియన్ సర్జన్ డాక్టర్ కిశోర్ రెడ్డి వివరించారు. వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి (39) మూడేళ్లుగా కడుపునొప్పి, కామెర్లతో బాధపడుతూ  కోల్ కతాలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. టెస్టులు చేసిన అక్కడి డాక్టర్లు అతడి కాలేయం, గాల్ బ్లాడర్ లో వివిధ సైజులో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. డాక్టర్లు ఎండొస్కోపిక్ క్లియరెన్స్ కు రెండుసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సదరు వ్యక్తి మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ కు వచ్చాడు. 

అతడిని పరీక్షించిన డాక్టర్ కిశోర్ రెడ్డి సర్జరీ చేసి రాళ్లను తొలగించాలని నిర్ణయించారు. కిశోర్ రెడ్డితో ఉన్న సర్జన్ల టీమ్ పేషెంట్ కు కోలిసిస్టెక్టీ ద్వారా వెయ్యి కంటే ఎక్కువున్న 250 గ్రాముల రాళ్లను సర్జరీ చేసి తొలగించారు. ఐదు రోజుల తర్వాత పేషెంట్ ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగుందని డాక్టర్ కిశోర్ రెడ్డి తెలిపారు. కాలేయం ద్వారా బయటికి వచ్చే  కొలెస్ట్రాల్‌‌‌‌‌‌‌‌ను కరిగించడానికి  గాల్ బ్లాడర్ లో తగినంత రసాయనాలు ఉంటాయని కానీ అంతకు మించిన మోతాదులో కొలెస్ట్రాల్ ఉంటే అవి స్ఫటికాలుగా మారి రాళ్లుగా ఏర్పడవచ్చని ఆయన చెప్పారు. గాల్ బ్లాడర్ నుంచి రాళ్లు వాటంతట అవే బయటకు వెళ్లిపోతాయన్నారు. రాళ్లు చిక్కుకున్నప్పుడు డాక్టర్​ను సంప్రదించాలన్నారు. లేకపోతే వాపు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.