
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రైతులు తమ పత్తిని సీసీఐ కొనుగోలు సెంటర్లలోనే అమ్మి, మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఎం.హరిత సూచించారు. 2025–26 పత్తి కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, పోలీస్, అగ్నిమాపక శాఖ శాఖల అధికారులతో బుధవారం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈసారి జిల్లాలో 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు.
గతేడాది 2.46లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని, వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేట మండలంలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు ఉన్నాయని తెలిపారు. అనంతరం పత్తి మద్దతు ధర పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, డీఏవో అఫ్జల్ బేగం, రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.