ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ‘మీకోసం’

ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ‘మీకోసం’

మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
నిలువ నీటిని తొలగిద్దాం.. దోమలను పారదోలుదాం

అంటువ్యాధులు ప్రబలకుండా అరికట్టడానికి మంత్రి మల్లారెడ్డి తన ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్రం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాల పాటు ‘మీకోసం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాదులకు కారణమవుతున్న దోమల నివారణకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పదినిమిషాల పాటు విధిగా అందరూ వారివారి ఇళ్లలో మరియు వారి ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఖాళీ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు ఈరోజు నుంచే విధిగా వారి ఇంటి పరిసరాలలో నిలిచి ఉన్న నీటిని తొలగించి వ్యాధులు వ్యాపించకుండా చూడాలి అన్నారు. ఎయిర్ కూలర్ లో ఉన్న నిలువ నీటిని తొలగించి కొత్త నీటిని పోసుకోవాలని ఆయన అన్నారు. రిఫ్రిజిరేటర్ యొక్క డ్రాప్ పాన్ తీసి అందులో ఉన్న నీటిని ఖాళీ చేయాలన్నారు. ఇంటి ముందు కానీ, వెనుక కానీ పగిలిన కుండలు, డబ్బాలు, డ్రమ్ములు మొదలగు వాటిలో నీరు నిలిచి ఉంటే తొలగించాలన్నారు. ఇంటి పరిసరాల్లోని పిచ్చిమొక్కలను, ఇంటి ఆవరణలో గుబురుగా పెరిగిన మొక్కలను కత్తిరించాలన్నారు. ఇంటికి సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంకులు ఖాళీ చేసి శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఆదివారం నిలువ నీటిని తొలగిద్దాం.. వ్యాధులకు కారణమయ్యే దోమలను పారదోలుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని వారివారి గ్రామాలను మరియు పట్టణాలను ఆరోగ్యవంతమైన మరియు పరిశుభ్రమైన ప్రాంతాలుగా మార్చుకోవాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలందరూ ఇళ్లకు పరిమితమై సహకరించాలని మంత్రి మల్లారెడ్డి ప్రజలను కోరారు.