
బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉంది మీనాక్షి చౌదరి. వెంకటేష్, మహేష్ బాబు లాంటి సీనియర్స్‌తో పాటు వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్, నవీన్ పొలిశెట్టి లాంటి జూనియర్ హీరోలతోనూ జోడీ కడుతూ వరుస చిత్రాలతో దూసుకెళుతోంది. తాజాగా తన ఖాతాలో రేర్ రికార్డ్ చేరబోతోంది. సంక్రాంతి హీరోయిన్‌గా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న మీనాక్షి.. 2024 సంక్రాంతికి మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’లో 2025 సంక్రాంతికి వెంకటేష్‌కు జంటగా ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వచ్చి బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడో సంక్రాంతికి కూడా మీనాక్షి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నవీన్ పొలిశెట్టికి జంటగా ఆమె నటిస్తున్న ‘అనగనగా ఒకరాజు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో వరుసగా మూడు సంక్రాంతి ఫెస్టివల్స్‌ని కవర్ చేసిన హీరోయిన్‌గా ఆమె రికార్డ్ క్రియేట్ చేయబోతుంది. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇందులో ఆమె ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనుంది.