21లోపు జాబితా పంపండి .. జిల్లా ఇన్చార్జ్లను ఆదేశించిన మీనాక్షి నటరాజన్

21లోపు జాబితా పంపండి .. జిల్లా ఇన్చార్జ్లను ఆదేశించిన మీనాక్షి నటరాజన్
  • ఈ నెలాఖరులోగా పార్టీ పదవులు భర్తీ చేస్తాం

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ కమిటీల కార్యవర్గం ప్రకటించేందుకు జాబితాలను పీసీసీకి, తనకు ఈ నెల 21లోపు పంపించాలని ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్​చార్జ్​లను రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్​లతో శుక్రవారం ఆమె జూమ్ మీటింగ్​లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘ఈ నెలాఖరులోపు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల కమిటీలను ప్రకటిస్తాం. అర్హులైన పార్టీ కార్యకర్తల పేర్లను సిఫార్సు చేస్తూ ఆ జాబితాను త్వరగా పంపించాలి. ప్రతి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒక మహిళ ఉండేలా చూడాలి. ఈ కమిటీల్లో సామాజిక న్యాయం స్పష్టంగా కనిపించాలి. కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం అని చెప్పుకోవడం కాదు. ఈ కమిటీలను చూస్తే ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థం కావాలి.

 2017కు ముందు నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 2017 తర్వాత పార్టీలో చేరిన వారికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి కమిటీలో 80 నుంచి 85 శాతం పాతవాళ్లు, 15 నుంచి 20 శాతం ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు ఉండాలి’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, జిల్లా ఇన్​చార్జ్​ల హోదాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, పార్టీ నేతలు వంశీచంద్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.