‘మీటింగ్ యూ’ షోలో తల్లికి చేరువ చేసిన కొరియా టీవీ
చనిపోయినోళ్లను ముట్టుకుని మాట్లాడేలా వీఆర్ టెక్నాలజీ
మనసుకు దగ్గరైనోళ్లు చనిపోతే ఉండే ఆ బాధ గురించి ఎంత చెప్పినా తీరదు. మరి, ఏమీ తెలియని వయసులో ఓ చిన్నారి చనిపోతే, ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగే బాధ ఇంకెలా ఉంటుంది? కడుపున పుట్టిన బిడ్డ ఇక రాదని తెలిసి, కన్నీరుమున్నీరయ్యే ఆ తల్లిదండ్రులను ఓదార్చడం కష్టం. పోయినోళ్ల జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. మరి, వాళ్ల బాధను తగ్గించే మార్గం లేదా? అంటే దక్షిణ కొరియాకు చెందిన ఓ టీవీ షో ఓ మంచి ఆలోచనతో ముందుకొచ్చింది. చనిపోయినోళ్లను వర్చువల్ రియాలిటీ (వీఆర్)తో మళ్లీ సృష్టించి, గత స్మృతులను ఆ చనిపోయినోళ్ల కుటుంబ సభ్యులకు ఇస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఆ షోలో ఓ తల్లికి అలాంటి మధురానుభూతినే మిగిల్చింది. 2016లో జబ్బుపడి చనిపోయిన తన ఏడేళ్ల కూతురును బతికించి, ఆమెతో గడిపేలా చేసింది.
మీటింగ్ యూ
మున్వా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఎంబీసీ) రూపునిచ్చిన ఆ షో పేరు ‘మీటింగ్ యూ’. నేయన్ అనే ఏడేళ్ల చిన్నారి 2016లో చనిపోయింది. అప్పటి నుంచి ఆమె తల్లి జాంగ్ జి సుంగ్ ఆమెనే తలచుకుంటూ బాధపడేది. ఈ నేపథ్యంలోనే ఆమె బాధను పోగొట్టాలన్న ఉద్దేశంతో నేయన్ రూపును వీఆర్‌తో సృష్టించింది ఎంబీసీ. అచ్చం నేయన్లాగే ఆ ప్రతిరూపాన్ని తయారు చేసింది. ఆ ప్రతిరూపంతో ఆమె తల్లి మాట్లాడేలా, తాకేలా ‘వైవ్’ అనే వీఆర్ హెడ్‌సెట్‌ను ఇచ్చింది. ఆ చిన్నారిని తాకేందుకు హ్యాండ్గ్లోవ్స్ను అందించింది. వాటిని పెట్టుకున్న జాంగ్, గార్డెన్లో ఉన్న నేయన్ ప్రతిరూపంతో ఆప్యాయంగా మాట్లాడింది. ఆమెను తాకింది. నేయన్ ప్రతిరూపమూ ఆమె తల్లితో మాట్లాడింది. మొదట నేయన్ ప్రతిరూపాన్ని తాకడానికి జాంగ్ వెనకాడింది. ‘అమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావ్. నేనే నేయన్. నన్ను పట్టుకో’ అని నేయన్ ప్రతిరూపం అనగానే జాంగ్ చలించిపోయింది. ‘ఐ మిస్ యూ అమ్మ’ అని నేయన్ అనగానే, ‘ఐ మిస్ యూ టూ’ అంటూ జాంగ్ కన్నీళ్లు పెట్టుకుంది. వస్తున్న ఆ కన్నీళ్లను ఆపుకోలేక, బాధను దిగమింగలేక నేయన్ను కౌగలించుకుంది. అయితే, ఆడియన్స్‌లో కూర్చుని ఆ షో చూస్తున్న నేయన్ తండ్రి, అన్న, అక్కలూ వాళ్లిద్దరి మధ్యా జరిగిన సన్నివేశాలను చూసి ఏడ్చేశారు. ఒకానొక టైంలో నేయన్ ప్రతిరూపం తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి పువ్వులిచ్చింది. ‘‘అమ్మా, నేను నిన్ను ఏం ఏడిపించట్లేదు కదా. నువ్వు ఎప్పుడూ నా గురించి బాధపడొద్దు’’ అని చెప్పింది. చివరగా, ‘‘అమ్మా, నేను బాగా అలసిపోయాను. నిద్రొస్తోంది’’ అని తల్లికి చెప్పింది. గుడ్‌బై చెప్పేసింది. ఇలాంటి షోలు నాలాగే ఆప్తులను కోల్పోయిన వారికి ఎంతో ఉపశమనం కలిగే ఫీలింగ్‌ను ఇస్తాయని జాంగ్ చెప్పింది.
