V6 News

MegaStar: చిరంజీవి-బాబీ #Mega158 లుక్ టెస్ట్ పూర్తి.. 'కాకాజీ'గా బాస్ ఊరమాస్ అవతారం!

MegaStar: చిరంజీవి-బాబీ #Mega158 లుక్ టెస్ట్ పూర్తి.. 'కాకాజీ'గా బాస్ ఊరమాస్ అవతారం!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ '#Mega158'. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ పై రకరకాల ఊహాగానాలు వినిపించారు.  'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కలయికతో ఈ చిత్రం వస్తోంది . ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ వీరు చేతులు కలపడంతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ కొత్త అవతారం..

లేటెస్ట్ గా ఈ సినిమా కోసం చిరంజీవిపై నిర్వహించిన లుక్ టెస్ట్ పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా షేర్ చేసిన మెనోక్రోమ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో చిరు మరీంత ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నారు.  ఆ ఫైనల్ లుక్ ఇప్పుడే లాక్ అయిందని బాబీ పేర్కొన్నారు. బాస్ మళ్లీ విస్ఫోటనం సృష్టించడానికి సిద్ధమయ్యారు అన్న రేంజ్‌లో ఈ లుక్ ఉండబోతోందని సమాచారం.

పుకార్లకు చెక్!

అయితే ఇటీవల ఈ ప్రాజెక్ట్ నుండి కేవీఎన్ ప్రొడక్షన్స్ తప్పుకున్నట్లు పుకార్లు వచ్చాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ KVN Productions బ్యానర్‌పై లోహిత్ ఎన్.కె. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు యూనిట్ ధృవీకరించింది. చిరంజీవి లుక్ టెస్ట్ ఫోటోను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.  షూటింగ్ కు రెడీ అవుతున్నట్లు చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. 

 

ఫ్లాష్‌బ్యాక్ హైలైట్

ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సినిమాకే ప్రాణం అని తెలుస్తోంది. అక్కడ వచ్చే ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయని టాక్.  ప్రస్తుతం ఈ చిత్రానికి ‘కాకాజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇది చిరంజీవి పాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని సమాచారం. చిరు సరసన సీనియర్ నటి ప్రియమణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గ్లామరస్ బ్యూటీ డింపుల్ హయతి ఈ సినిమాలో ఒక కీలకమైన నెగటివ్ షేడ్ ఉన్న రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఈ చిత్రానికి సంగీతం ఎస్ ఎస్ థమన్ అందిచనున్నారు. నిమిష్ రవి తన కెమెరా పనితనంతో మెగాస్టార్‌ను విజువల్ వండర్‌గా  చూపించనున్నారు.

మే నెలలోనే గ్రాండ్ లాంచ్!

అన్ని అడ్డంకులను అధిగమించి, ఈ చిత్రం మే నెలలో గ్రాండ్ ముహూర్తపు వేడుకను జరుపుకోనుంది. అదే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. 'వాల్తేరు వీరయ్య'లో వింటేజ్ చిరంజీవిని చూపించిన బాబీ, ఈసారి 'కాకాజీ'తో ఎలాంటి రికార్డులు తిరగరాస్తారో చూడాలి.