మెగా డెయిరీ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి తలసాని

మెగా డెయిరీ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి తలసాని

ఆఫీసర్లతో మంత్రి తలసాని సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మెగా డెయిరీ నిర్మాణ పనులను స్పీడప్ చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన ఆఫీసులో డెయిరీ నూతన చైర్మన్ సోమ భరత్ కుమార్‌‌‌‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విజయ డెయిరీ అభివృద్ధి లో భాగంగా రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో రూ.250 కోట్లతో ఆధునిక టెక్నాలజీతో 5 లక్షల లీటర్ల కెపాసిటీ గల మెగా డెయిరీ కడుతున్నట్లు చెప్పారు. విజయ డెయిరీ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, వాటిని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెద్ద ఎత్తున ఔట్ లెట్ లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. విజయ డెయిరీని మరింత అభివృద్ధి చేసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 

ఇందులో భాగంగా మరిన్ని కొత్త ఔట్ లెట్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజయ డెయిరీ కి పాలు పోసే రైతులకు సర్కారు చేయూతను అందిస్తున్నదని, రైతులు విజయ డెయిరీకి పాలు పోసే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగేందుకు అధిక పాలను ఇచ్చే నాణ్యమైన పాడి పశువుల ఉత్పత్తి కోసం గ్రామాలలో కృత్రిమ గర్భధారణ శిబిరాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డెయిరీ నూతన చైర్మన్ గా నియమితులైన సోమభరత్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.