
మెదక్, వెలుగు: జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ ను ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా 17న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు.
ఓపెన్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్పరీక్షల పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ లో డీఈవో రాధా కిషన్ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బాలికల హై స్కూల్ ఆవరణలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈనెల 22 నుంచి 28 వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.00 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జి పునరుద్ధరించాలి
వర్షాలకు దెబ్బతిన్న మక్త భూపతిపూర్ బ్రిడ్జి, మున్సిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్ల పనులను తాత్కాలిక మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మక్త భూపతిపూర్ రూట్లో దెబ్బతిన్న బ్రిడ్జి, చెరువును పరిశీలించారు. అనంతరం మెదక్ మున్సిపాలిటీ పరిధి నాలుగో వార్డులో వర్షాల కారణంగా దెబ్బతిన్న సీసీ రోడ్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీఈ మహేశ్, ఏఈ నితిన్, శానిటరీ ఇన్స్పెక్టర్నాగరాజు ఉన్నారు.