మేఘా అక్రమ మైనింగ్.. ప్రభుత్వ భూముల్లో గ్రావెల్​, క్వార్ట్జ్, మెటల్​​ తవ్వకాలు

మేఘా అక్రమ మైనింగ్.. ప్రభుత్వ భూముల్లో గ్రావెల్​, క్వార్ట్జ్, మెటల్​​ తవ్వకాలు
  • గద్వాల జిల్లాలో మేఘా అక్రమ మైనింగ్
  • ప్రభుత్వ భూముల్లో గ్రావెల్​, క్వార్ట్జ్, మెటల్​​ తవ్వకాలు
  • ఎలాంటి పర్మిషన్​ తీసుకోలేదంటున్న  మైనింగ్ ​ఆఫీసర్లు
  • సీనరేజ్ ​ఎగ్గొట్టారనే ఆరోపణలు 
  • రూ.52 లక్షలు కట్టాలంటూ కంపెనీకి నోటీసులు
  • నిబంధనలు ఫాలో అయ్యామంటున్న  మేఘా అధికారులు

గద్వాల, వెలుగు:   చెన్నై కారిడార్​లో భాగంగా  నందిన్నె నుంచి నంద్యాల వరకు 77 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్న మేఘా ఇంజినీరింగ్​ ప్రైవేట్ లిమిటెడ్ ​కంపెనీ అక్రమ మైనింగ్​కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్​ లేకుండా ప్రభుత్వ భూములు, గుట్టల్లోంచి కోట్ల విలువైన గ్రావెల్​, క్వార్ట్జ్(పలుగురాయి), డైమండ్​ సెట్​మెటల్ తవ్వి, రోడ్డు పనులకు తరలించిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈక్రమంలో మేఘా కంపెనీ  యథేచ్ఛగా రూల్స్​ ఉల్లంఘించిందని, ఎలాంటి పర్మిషన్లు లేకుండా, పైసా సీనరేజ్ ​చార్జెస్​ చెల్లించకుండా అక్రమ మైనింగ్ కు పాల్పడిందని మైనింగ్ శాఖ ఆరోపిస్తోంది. కంపెనీ ప్రతినిధులకు ఇప్పటికే షోకాజ్​ నోటీసులిచ్చిన గద్వాల జిల్లా మైనింగ్​ అధికారులు స్పందన లేకపోవడంతో  52 కోట్ల 35 లక్షల 72 వేల 281 రూపాయలకు డిమాండ్ నోటీసు పంపించారు. 

రెండు రీచ్ లు.. 77 కిలోమీటర్లు

భారత్ మాలలో భాగంగా భారత ప్రభుత్వం చెన్నై కారిడార్ పేరుతో మహారాష్ట్రలోని అక్కల్​కోట నుంచి చెన్నై వరకు సూపర్ ఫాస్ట్ నేషనల్ హైవే (ఎన్​హెచ్​150సీ) నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో కర్ణాటక బార్డర్ నందిన్నె నుంచి నంద్యాల వరకు 77 కిలోమీటర్ల పనులను మేఘా  కన్​స్ట్రక్షన్​ కంపెనీ దక్కించుకున్నది. నందిన్నె నుంచి జులేకల్ వరకు ఫేజ్​ వన్ కింద 38 కిలోమీటర్లు. జులేకల్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు 39 కిలోమీటర్లు   సెకండ్ ఫేజ్​ కలుపుకొని రెండు రీచ్ లలో  మొత్తం 77 కిలోమీటర్ల రోడ్డు పనులను నేషనల్ హైవే అథారిటీ నుంచి మేఘా కంపెనీ దక్కించుకొని పనులు చేస్తున్నది.

అక్రమ మైనింగ్​ ఇలా.. 

నేషనల్ హైవే పనులు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్​ కంపెనీ మైనింగ్ శాఖ రూల్స్ పాటించకుండా, ఎలాంటి సీనరేజ్ ​చార్జెస్ చెల్లించకుండా  ప్రభుత్వ భూములు, గుట్టల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడిందని  మైనింగ్ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. కంపెనీకి అందజేసిన నోటీసుల ప్రకారం.. గద్వాల జిల్లా  కేటి దొడ్డి మండలంలోని కుచినేర్ల విలేజ్ లోని 52 సర్వే నంబర్ లో 1,16,224 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను (విలువ రూ.3 కోట్ల 95 లక్షల 39 వేల 406), అదే సర్వే నంబర్​లోని క్వార్జ్( పలుగు రాళ్లు) 1,55, 445 క్యూబిక్ మీటర్లు(విలువ రూ. 39 కోట్ల 70 లక్షల 34వేల937)ను తవ్వుకెళ్లారు. గట్టు మండలం రాయపురం విలేజ్ లోని సర్వే నంబర్ 83 లో 24, 592.47 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను(విలువ రూ. 83,66,350 ), ఇదే మండలం రాయపురం విలేజ్ లోని  సర్వేనెంబర్ 199లో క్రషర్ యూనిట్ స్టోన్ మెటల్ ఏర్పాటు చేసి 1,17,811 మెట్రిక్ టన్నుల కంకర డైమండ్ సేల్ మెటల్(విలువ రూ.4 కోట్ల 85 లక్షల 74వేల912)ను, సర్వే నంబర్ 1999లో  క్వారీ కోసం 15,294.6 క్యూబిక్ మీటర్ల రాళ్లను(విలువ రూ.3 కోట్ల ఒక లక్ష,216 ) తవ్వి తరలించారు. వడ్డేపల్లి మండలం 377 సర్వే నెంబర్​లోని 1,16,096 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ ను( విలువ రూ.3 కోట్ల 94 లక్షల 95 వేల,860) అక్రమంగా తవ్వి తరలించారని  ఆరోపించిన మైనింగ్​ ఆఫీసర్లు, ఇందుకు పదిరెట్ల ఫైన్​ విధిస్తూ డిమాండ్ నోటీసు పంపించారు.

ఓన్లీ ఎన్​వోసీ.. నో పర్మిషన్​..నో సీనరేజ్..

‘భారత్ మాల’లో భాగంగా హైవే పనులు చేపడుతున్న మోఘా కంపెనీ.. కేటి దొడ్డి మండలం కుచినెర్లలోని సర్వే నంబర్ 52లో, గట్టు మండలం రాయపురంలోని సర్వే నంబర్లు 83,199తో పాటు వడ్డేపల్లి మండలంలోని సర్వే నంబర్ 377లో తవ్వకాలు చేపట్టింది. ఇవన్నీ ప్రభుత్వ భూములే అని మైనింగ్ ఆఫీసర్లు తేల్చారు. ఆ భూముల్లో తవ్వకాలు చేపట్టే ముందు మేఘా ఆఫీసర్లు  సంబంధిత తహసీల్దార్లతో నో అబ్జెక్షన్ లెటర్లు మాత్రమే తీసుకున్నారు తప్ప మైనింగ్​శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సీనరేజ్​చార్జెస్ చెల్లించలేదు. దీంతో గద్వాల మైనింగ్​ ఏడీ విజయరామరాజు కంపెనీ ప్రతినిధులకు మొదట షోకాజ్​ నోటీసులిచ్చారు. కానీ వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో తాజాగా రూ.52.35 కోట్లకు డిమాండ్ నోటీసు పంపించారు. కాగా,  సీనరేజ్​ చార్జీలను నేషనల్ హైవే అథారిటీ చెల్లిస్తుందని, కొన్ని పొరపాట్ల వల్ల ఇది ఆలస్యమైందని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.

డిమాండ్ నోటీసు పంపించాం

మేఘా కన్​స్ట్రక్షన్ కంపెనీ గద్వాల జిల్లాలో అక్రమ మైనింగ్ కు పాల్పడింది. ఎలాంటి పర్మిషన్​ తీసుకోకుండానే తవ్వకాలు చేపట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎలాంటి సీనరేజ్​ చార్జీలు చెల్లించలేదు. ఈ విషయమై ఇదివరకే షోకాజ్​ నోటీసులు ఇచ్చాం. సరైన స్పందన లేకపోవడంతో తాజాగా డిమాండ్ నోటీసు పంపించాం. మేము రూల్స్​ ప్రకారం నడుచుకుంటున్నాం. 
-
 విజయరామరాజు, మైనింగ్ ఏడీ

ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం

మేము ఇల్లీగల్ గా ఎలాంటి మైనింగ్ చేయలేదు. మా కాంట్రాక్ట్ లో భాగంగా రూల్స్ ప్రకారమే ముందుకెళ్తున్నాం. నేషనల్ హైవే అథారిటీ మాకిచ్చే మొత్తం నుంచి సీనరేజ్​ చార్జెస్​ పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తుంది. మైనింగ్ ​శాఖ నుంచి డిమాండ్ నోటీసు వచ్చింది.  దానికి నేషనల్ హైవే అథారిటీ సమాధానం కూడా ఇచ్చింది. 

- వినోద్ కుమార్,   ప్రాజెక్ట్ మేనేజర్, మేఘా కంపెనీ