మూడు నెలలకోసారి జాబ్ మేళాలు : మంత్రి వాకిటి శ్రీహరి

మూడు నెలలకోసారి జాబ్ మేళాలు : మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్‌‌‌‌నగర్ అర్బన్, వెలుగు: యువత ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా విస్తృత అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబ్‌‌‌‌నగర్ నగరంలోని శిల్పారామంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ మేళాలో సుమారు ఆరు వేల మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేసుకున్నారని మంత్రి తెలిపారు. మొత్తం 105 కంపెనీలు పాల్గొని ప్రత్యక్ష ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు అందిస్తున్నాయని చెప్పారు. త్వరలో సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ  ఇచ్చి యువతను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.