మరోసారి పోటీకి సై అంటున్న చిరు, బాలయ్య!

మరోసారి పోటీకి సై అంటున్న చిరు, బాలయ్య!

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలంతా సమైక్యంగానే ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం మా హీరో అంటే మా హీరో అని గొప్పలకు పోయి గొడవలు పడడం చూస్తూనే ఉంటాం. ఇది ఒక్క టాలీవుడ్, కోలీవుడ్ అనే కాదు.. అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ రకమైన ధోరణి కొత్తేం కాదు. చిన్న సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు వేరే హీరో సినిమా గురించి ఆలోచించకపోయినా.. పెద్ద సినిమాల కొచ్చేసరికి మాత్రం రెండు, మూడు వారాల గ్యాప్ చూసుకోవడం షరా మామూలే. కానీ పండగలప్పుడు మాత్రం పెద్ద హీరో చేసిన సినిమాలైనా సరే పోటీ ఉండాల్సిందే. సంక్రాంతి, దసరా లాంటి పండగలకు స్టార్ హీరోలు సైతం తమ టాలెంట్ ను నిరూపించుకోవాల్సిందే. 

అయితే బాక్సాఫీస్ దగ్గర ఎందరు హీరోలు పోటీ పడినా కానీ, చిరంజీవి, బాలకృష్ణ బరిలో ఉంటే ఆ కిక్కే వేరు. థియేటర్ల దగ్గర సందడి, అభిమానుల కోలాహలం, ఎవరు హిట్ కొట్టారు.. ఎవరు బోల్తా పడ్డారు లాంటి టాక్ తో అంతా హడావుడి ఉంటుంది. చిరంజీవి, బాలయ్య ఇద్దరూ ఇప్పటివరకు దాదాపు 18 సార్లు పోటీ పడ్డారు. మొదటగా మంగమ్మ గారి మనవడు, ఇంటిగుట్టు సినిమాల నుండి బాలయ్య, చిరంజీవిల సినిమాల వార్ కంటిన్యూ అయ్యింది. ఆ తర్వాత వరుసగా పోటీపడ్డారు. హిట్లర్, పెద్దన్నయ్య, అన్నయ్య, వంశోద్దారకుడు, మృగరాజు, నరసింహా నాయుడు, అంజి, లక్ష్మీ నరసింహ ఇలా 18 సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత మొన్న ఖైదీ నెంబర్ 150, గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా రిలీజ్ కాగా.. రెండూ మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి హీరోల మధ్య పోటీ తప్పే అవకాశం లేనట్టు తెలుస్తోంది. 


మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా, తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసీఫెర్ మూవీకి ఇది రిమేక్. అయితే ఈ  సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్.

మరోపక్క బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని కూడా అక్టోబర్ 5 వ తారీఖున విడుదల చెయ్యడానికి ఆ చిత్ర బృందం సన్నాహాలు చేస్తునట్టు సమాచారం. ఇలా ఈ రెండు సినిమాలూ ఒకేరోజు విడుదల అవుతున్నాయంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత చిరంజీవి వస్తుంటే.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య బరిలోకి దిగుతున్నాడు. ఈ రెండు సినిమాలూ పోటీ పడితే ఎవరు గెలుస్తారన్న వార్.. ఆ ఇద్దరి హీరోస్ ఫ్యాన్స్ మధ్య ఇప్పటి నుంచే ప్రారంభమవుతుందేమో. అనుకున్నట్టు గానే ఈ స్టార్ హీరోల మూవీస్ రెండూ ఒకేసారి వస్తే.. ఎలా ఉంటుందో చూడాలంటే.. ఈ సినిమాల రిలీజ్ గురించి అఫీషియల్ డేట్ వరకూ వెయిట్ చేయాల్సిందేనంటున్నారు సినీ అభిమానులు.