హనుమాన్ను మించిన సూపర్ హీరో లేడు: మెగాస్టార్ చిరంజీవి

హనుమాన్ను మించిన సూపర్ హీరో లేడు: మెగాస్టార్ చిరంజీవి

యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja), దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) కాంబోలో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్(HanuMan). కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన  చిరంజీవి మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచీ నా ఆరాధ్య  దైవం అయిన హనుమంతుడి గురించి తెలియజేసే చిత్రమిది. ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే నేను ఇక్కడి వరకు వచ్చానని నమ్ముతాను. ఆయన నాకు ఇన్‌‌స్పైరింగ్ పర్సనాలిటీ.

ఎన్నో సందర్భాల్లో ఆయన మా కుటుంబంలో ధైర్యాన్ని నింపడంతో ఆంజనేయ స్వామి మా కుల దైవం అయ్యారు. ఆయన  ఒకసారి ఆశీస్సులు అందిస్తే.. జీవితాంతం వదలడు. ప్రతిక్షణం మనలోనే ఉంటాడు. ‘హనుమాన్’ను మించిన సూపర్ హీరో ఎవరూ ఉండరు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు కథతో పాటు విజువల్స్, సౌండింగ్ అన్ని బాగున్నాయి. తేజ కష్టం వృధా కాదు. సంక్రాంతి సీజన్‌‌లో ఎన్ని సినిమాలు వచ్చినా బాగుంటే ప్రతి ప్రతిదాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు.ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించి టీమ్ అందరికీ మంచి పేరు వస్తుంది’ అని చెప్పారు.

తేజ సజ్జ మాట్లాడుతూ ‘ఇతిహాసాల్లో రాముడికి సాయం చేయడానికి హనుమండుతు వచ్చినట్టే.. మా ‘హనుమాన్‌‌’కు సాయం చేయడానికి రాముడే హనుమంతుడి రూపంలో చిరంజీవి గారిని పంపించారు. మా అమ్మ నాన్న తర్వాత  నా జీవితంలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే చిరంజీవి గారికే. ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని. ఈ సినిమా ప్రశాంత్ వర్మ కల. అన్నీ తానై దీన్ని రూపొందించారు. నన్ను సూపర్ హీరోగా నిలబెట్టారు. సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బాగా ఆడాలి.. అందులో మాది ఉండాలి’ అని చెప్పాడు.  మీనాక్షి రోల్ తన కెరీర్‌‌‌‌లో స్పెషల్‌‌గా నిలిచిపోతుందని చెప్పింది హీరోయిన్ అమృత అయ్యర్.

ఇందులో పార్ట్ అవడం హ్యాపీ అంది వరలక్ష్మీ. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ‘సినిమా తీయడం ఒక యుద్ధం లాంటిది. దానికి తేజ ఆయుధంలా దొరికాడు.   ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడనేది మా సినిమా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని చెప్పాడు.  ఇదొక విజువల్ వండర్ అని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు నిర్మాత నిరంజన్ రెడ్డి. వినయ్ రాయ్, గెటప్ శ్రీను సహా టీమ్ అంతా పాల్గొన్నారు.