ఇండస్ట్రీ పెద్దరికం నాకొద్దు : మెగాస్టార్ చిరంజీవి

ఇండస్ట్రీ పెద్దరికం నాకొద్దు  : మెగాస్టార్ చిరంజీవి

ఇండస్ట్రీలో పెద్దరికం చెలాయించాలన్న ఉద్దేశం తనకు లేదని, తనకు ఎలాంటి కుర్చీలూ వద్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇండస్ట్రీ పెద్దరికం తనకొద్దని తేల్చిచెప్పారు. కొందరు చిన్నవాళ్లమని చెప్పుకుంటూ తనను పెద్ద చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన సినీ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, సినీ వర్కర్స్, లబ్ధిదారులు పాల్గొన్నారు. 

కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజంకాస్తా చిరంజీవి భరోసా ఇచ్చారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో అవకతవకలు జరిగిన విషయం తనకు తెలియదని అన్నారు. అందుకే దానిపై మాట్లాడనని అన్నారు. చిత్రపురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలుగు సినీ కార్మికులకు గృహాసముదాయం ఏర్పడిందని అన్నారు. సినీ కార్మికులకు చేదోడు,  వాదోడుగా ఉంటానని, ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా తాను సపోర్ట్ గా ఉంటానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి, ఎంతో కష్టపడి గృహ సముదాయాన్ని పూర్తి చేసిన అనిల్ , దొరైలను ప్రశంసించారు. బిజీగా ఉన్నప్పటికీ కార్యక్రమం ప్రత్యేకత తెలిసి అన్ని పనులూ వాయిదా వేసుకొని వచ్చానని చిరంజీవి అన్నారు.. సినీ కార్మికులకు సొంత గృహం ఉండటం ఎంతో అవసరమన్న ఆయన... ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైందని చెప్పారు. ఎంతో నీతి, నిజాయతీతో వల్లభనేని అనిల్ కమిటీ గృహా సముదాయాన్ని పూర్తి చేసిందన్నారు. 

ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదు

ఈ రోజు గృహప్రవేశం చేసుకోవడం వెనక చాలా మంది సహకారం, ఎంతో మంది కృషి ఉందని చిత్రపురీ కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి, చదలవడా శ్రీనివాస్ సహాయం ఎంతో చేశారన్నారు. దాసరి నారాయణ రావు తర్వాత  మెగాస్టార్ చిరంజీవి అండగా ఉన్నారని, ఈరోజు కూడా రూ.130కోట్ల లోటు బడ్జెట్ తో సొసైటీ ఉందని తెలిపారు. చిత్ర పూరీ కాలనీ గురించి ఎన్నో ధర్నాలు జరిగాయన్నారు. కానీ ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ఇందులో ఉండేది సినీ కార్మికులని, 65ఎకరాల్లో కట్టిన ఈ కాలనీకి మంచి నీటి సదుపాయం కల్పించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా లబ్ది దారులు ఇంటి తాళాలు అందుకున్నారని చెప్పారు.