పనులు చేయించుకొని పైసలిస్తలేరు..

పనులు చేయించుకొని  పైసలిస్తలేరు..

దేవాదుల సొరంగం పనులను అడ్డకున్న కార్మికులు
నాలుగు నెలలుగా జీతాలివ్వడంలేదని ధర్నా
మేఘ కంపెనీ అధికారుల
హామీతో విరమణ

దేవాదుల సొరంగంలో పనులు చేయించుకున్నరు. జీతాలు అడిగితే అప్పుడిస్తా.. ఇప్పుడిస్తా.. అంటూ నాలుగు నెలలుగా సాగదీస్తున్నరు. ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోవడంతో పైసలియ్యకుంటనే ఎళ్లిపొమ్మంటరేమోనని కార్మికులు పరేషాన్‌‌ అయితున్నరు. మా కూలీ పైసలు మాకిప్పుడే ఇయ్యాలని సొరంగం పనులాపి ధర్నాకుదిగిన్రు.

దేవాదుల సొరంగం పనులను తొలుత కోస్టల్​ కంపెనీ చేపట్టింది. ఆ కంపెనీ పనులను సగంలోనే వదిలేసి వెళ్లిపోయింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మేఘ కంపెనీ ఈ పనులు చేయిస్తోంది. మేఘలో పనిచేసే రహీం, నాగరాజు కాంట్రాక్ట్ పద్ధతిలో అసొం రాష్ట్రం నుంచి కొందరిని, శాయంపేట మండలానికి చెందిన కొదరిని మాట్లాడించి పెట్టారు. వీరి వేతనాలు కంపెనీతో సంబంధం లేకుండా రహీం చెల్లించేవిధంగా అగ్రిమెంట్ రాసుకున్నరు. పనులు ప్రారంభమైన తరువాత ఒక నెల జీతాలు ఇచ్చారు. మార్చి నుంచి ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని కార్మికులు చెప్పారు.

ప్రతి నెల చివరిలో వచ్చే నెలలో ఇస్తామంటూ కొనసాగిస్తూ వచ్చారు. అయితే జులై7వ తేదీతో రహీం, నాగరాజుల కాంట్రాక్ట్ పూర్తికావడంతో కార్మికులను సైతం ఇదే రోజు నుంచి పనుల చేయొద్దని మెగా కంపెనీ సూచించింది. దీంతో మాజీతాలు ఇచ్చే వరకు సొరంగం పనులను చేయ్యనివ్వమని 30 మంది కార్మకులు ధర్నాకు దిగారు. వెహికిల్స్, కార్మికులు సొరంగంలోకి వెళ్లకుండా అడ్డకున్నారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న మేఘ కంపెనీ ప్రతినిధులు మైలారం ఆడిట్ పాయింట్ వద్ద చేరుకొని రెండు రోజుల్లో జీతాలు ఇస్తామని చెప్పడంతో ధర్నాను విరమించారు.