9 ఏళ్ల కిందనే ఆర్టీసీలో మేఘా ఎంట్రీ

9 ఏళ్ల కిందనే ఆర్టీసీలో మేఘా ఎంట్రీ

9 ఏళ్ల కిందనే ఆర్టీసీలో మేఘా ఎంట్రీ
₹10.8 కోట్లు ఎగ్గొట్టింది
బస్సుల్లో ఎల్​సీడీల ఏర్పాటుకు ఒప్పందం
డేట్​ ప్రకారం ముందుకు కదలని అగ్రిమెంట్
నోటీస్​ ఇవ్వకుండానే మధ్యలో డ్రాప్​
బకాయిలు చెల్లించకుండానే ₹2.85 కోట్ల డిపాజిట్లు వెనక్కి
ఎల్​సీడీలూ తీసుకెళ్లిన వైనం చక్రం తిప్పిన నాటి ఎంపీ
బకాయిలు చెల్లించకుండానే ₹2.85 కోట్ల డిపాజిట్లు వెనక్కి

హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీకి మేఘా కృష్ణారెడ్డి మెయిల్​ కంపెనీ ₹10.8 కోట్ల బాకీలు ఎగ్గొట్టింది.సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే, ఈ కేసు ఇప్పటిది కాదు. ప్రస్తుతం ఆర్టీసీలో మేఘాకు చెందిన 40 ఎలక్ట్రిక్​ బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆ కంపెనీ 2010లోనే ఆర్టీసీలోకి ఎంట్రీ ఇచ్చింది. బస్సుల్లో ఎల్​సీడీలు పెట్టి, ప్రకటనల ద్వారా ఆదాయం పొందేలా యాజమాన్యంతో మేఘా కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ ప్రాజెక్టును మధ్యలోనే వదిలేసిన సంస్థ, రాజకీయ పైరవీలు చేసి ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలను ఎగ్గొట్టింది. బస్సుల్లో పెట్టిన ఎల్​సీడీలనూ తీసుకెళ్లింది.

ఒప్పందం ఇదీ..

ఉమ్మడి ఏపీలో 21,165 బస్సుల్లో ఎల్​సీడీలు ఏర్పాటు చేసి, వినోద కార్యక్రమాలను ప్రసారం చేయాలి.  అందుకు తగ్గట్టు 2010 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్​ 31 వరకు 15 ఏళ్ల పాటు కంపెనీ ఒప్పందం చేసుకుంది. ప్రకటనల ద్వారా మేఘా కంపెనీ ఆదాయాన్ని పొందొచ్చు. అందుకుగానూ ఒక్కో బస్సుకు కంపెనీ నెలకు రూ.225 చెల్లించాల్సి ఉంటుంది. 2010 ఆగస్టు 31 వరకు మేఘదూత్​, సూపర్​ లగ్జరీ, డీలక్స్​ బస్సులు, 2011 జూన్​ 30 వరకు ఇతర బస్సుల్లో టీవీలు ఏర్పాటు చేయాలి. ఆ గడువులోగా పెట్టకపోతే బస్సుకు ₹100 చొప్పున ఫైన్​ వేస్తారు. ఆ షరతులన్నింటికీ ఒప్పుకుని ఆర్టీసీతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ₹2.85 కోట్ల డిపాజిట్​ కూడా కట్టింది. కానీ, కంపెనీ టీవీలు పెట్టడంలో ఎప్పుడూ ఆలస్యమే చేసింది. అనుకున్న డేట్​ కాకుండా ఏడాది పాటు లేట్​ చేసింది.

దీనిపై ఆర్టీసీ అధికారులు సమావేశమై చర్చించారు.  2011 జులై 6న కంపెనీకి షోకాజ్​ నోటీసులిచ్చారు. కంపెనీ ఆలస్యం చేయడం వల్ల పీక్​ సీజన్​లో ప్రభావం చూపుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. లైసెన్స్​ ఫీజు కూడా చెల్లించలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. 2011 జూన్​ 30 నాటికి బకాయిలు ₹7.08 కోట్లకు చేరుకున్నాయని కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. 1,789 సూపర్​ లగ్జరీ బస్సులకు గానూ 1,274 బస్సుల్లో మాత్రమే ఎల్​సీడీలు ఏర్పాటు చేశారని గుర్తు చేసింది. అయినా కూడా కంపెనీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చెప్పాపెట్టకుండానే ఒప్పందం నుంచి తప్పుకుంది.

రాజ్యసభ సభ్యుడి పైరవీ

ఒప్పందం ప్రకారం మెయిల్​ కంపెనీ ఎల్​సీడీలు పెట్టకపోవడంతో ఆర్టీసీకి కంపెనీ ₹16 కోట్ల దాకా బకాయి పడింది. అందులో లైసెన్స్​ ఫీజు ₹14.5 కోట్లు కాగా, మిగతా ₹1.5 కోట్లు సర్వీస్​ ట్యాక్స్​. కానీ, ఒప్పందం నుంచి కంపెనీ తప్పుకున్నాక, అప్పట్లో వేసిన ఓ కమిటీ బకాయిల్లో ₹6 కోట్ల వరకు మాఫీ చేసినట్టు తెలుస్తోంది. ఒప్పందం నుంచి తప్పుకునే ముందు నోటీసు ఇవ్వకపోతే, సెక్యూరిటీ డిపాజిట్​ను తిరిగివ్వరు. అయితే, రాష్ట్రంలో చక్రం తిప్పిన నాటి రాజ్యసభ సభ్యుడు ₹10. 8 కోట్ల బకాయిలు చెల్లించకుండా పైరవీ చేయించారన్న ఆరోపణలున్నాయి. దాంతో పాటే కట్టిన సెక్యూరిటీ డిపాజిట్​నూ తిరిగివ్వడంలో ఎండీ స్థాయిలో పైరవీలు చేయించారని అంటున్నారు. అది కాకుండా బస్సుల్లో అప్పటికే పెట్టిన ఎల్​సీడీలనూ తిరిగి తీసుకెళ్లారని చెబుతున్నారు.