హైదరాబాద్, వెలుగు: సీనియర్ తెలుగు జర్నలిస్ట్, ప్రముఖ ఉర్దూ తెలుగు– అనువాదకుడు మెహక్ హైదరాబాదీ(పీవీ సూర్యనారాయణమూర్తి) కేంద్ర విద్యాశాఖలోని ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. జాతీయ మండలి డైరెక్టర్ ప్రొఫెసర్ ధనుంజయ్ సింగ్ ఈ మేరకు మెహక్‌కు లేఖ రాశారు. ఆయన మూడేండ్ల పాటు సభ్యులుగా కొనసాగుతారు.
మెహక్ గత 36 ఏండ్ల పాటు అయిదు ప్రధాన తెలుగు దినపత్రికలలో పనిచేసి 2021లో రిటైర్డ్ అయ్యారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం ఉండ్రాజవరం. ప్రముఖ ఉర్దూ రచయితల కథా సాహిత్యాన్ని తెలుగు వారికి అందించారు. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కలిపి ఇప్పటి దాకా మొత్తం తొమ్మిది పుస్తకాలు తెచ్చారు. ప్రముఖ ఉర్దూ రచయిత్రి జీలానీ బానూ రెండు సంకలనాలు, ఆమె బాల్య జ్ఞాపకాలతో ఒక పుస్తకం, సాదత్ హసన్ మంటో రెండు కథా సంకలనాలు, అమృతా ప్రీతమ్ నవల అస్థిపంజరం ఒకనాటి హైదరాబాద్ సంస్థానంపై విప్లవ కవి మఖ్దూం మొహియుద్దీన్ రాసిన వివాదాస్పద పుస్తకం, హైదరాబాద్‌పై సోషలిస్టు నేత చెరుకు మాధవ రెడ్డి రాసిన రచనను ఉర్దూ నుంచి తెలుగులోకి అనువదించారు. గత 80 ఏండ్ల వ్యవధిలో హైదరాబాద్ లోని ఉర్దూ రచయితలు హిందువుల జీవితాలపై రాసిన ప్రత్యేక థీమ్ తో ‘గుల్ దస్త‘ పేరుతో ఒక సంకలనం ప్రచురించారు.
