సుప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్... భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు

సుప్రసిద్ధ మొఘల్ చక్రవర్తి అక్బర్...  భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు

ఆఫ్ఘన్​లు 1554లో ఒకరితో ఒకరు కలహించుకోసాగారు. ఆ సమయంలో హుమయూన్ అక్బర్​తో సహా సింధునదిని దాటి, పంజాబ్​ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత 15 సంవత్సరాల క్రితం తాను వదిలిపెట్టి పారిపోయిన ఢిల్లీలో ప్రవేశించాడు. 

ఆయన అక్బర్​ను పంజాబ్​ ప్రభువుగా, తనకు విశ్వాసపాత్రుడైన బైరాంఖాన్​ ఆధ్వర్యంలో నియమించాడు. కానీ, ఏడాది తిరిగేసరికి ఆయన అకస్మాత్తుగా మరణించాడు. దాంతో అక్బర్ తన13వ ఏట చక్రవర్తిగా ప్రకటించారు. కానీ, కొన్నాళ్లపాటు బైరాంఖానే రాజుగా కొనసాగాడు. 

అక్బర్ తల్లి అంతఃపురాన్ని పరిశీలించినప్పుడు అక్బర్​ తెరవెనక ఉంటూ అన్ని విషయాలను అభ్యసించే పనిలో ఉండేవాడు. ఒకానొక రోజు తను ఒంటరిగా గుర్రంపై స్వారీ చేసి ఒక చోట ఆగాడు. ఆ తర్వాత కాసేపటికి ఇక తాను రాజుగా బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చిందని గ్రహించాడు. ప్రజల గురించి అధ్యయనం చేయసాగాడు. రోజూ చీకటి పడగానే మారువేషం వేసుకుని అంతఃపురం నుంచి బయటికొచ్చేవాడు. 

ప్రజలతో కలిసి వాళ్ల ప్రవర్తనను గమనించేవాడు. రాజభవనంలో తన చుట్టూ ఉండే వాళ్లు ఎలాంటి ఎత్తులు వేస్తున్నారో స్వయంగా తెలుసుకునేవాడు. అతని ధైర్యసాహసాలు చూసి మిగతావారు భయపడేవాళ్లు. 1560లో అంతఃపురంలో కుట్రలు ఊపందుకున్నాయి. ఆదంఖాన్​ అక్బర్ మీదికి కత్తి దూశాడు. అక్బర్​ ప్రతి దాడి చేయడంతో అతను స్పృహ కోల్పోయాడు. అతన్ని కిందకి తోసెయ్యమని భటులను ఆజ్ఞాపించాడు. అతన్ని అక్బర్​కు వ్యతిరేకంగా రెచ్చిగొట్టి, చావు వరకు తీసుకొచ్చిన తల్లి, కొడుకు చావును చూసి భరించలేక రెండు నెలలు కాకముందే మరణించింది. 

►ALSO READ | గ్రీన్ ల్యాండ్.. ఐస్ ముక్క కాదు

అక్బర్​ని తొక్కేయాలని చూసిన వాళ్లంతా తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. తన 20వ ఏట చరిత్రకారుడు, అనుయాయి అయిన అబ్దుల్​ ఫజల్ ప్రకారం ‘తెరచాటు నుంచి ముందుకు వచ్చాడు’. తన ప్రభుత్వం మీద పూర్తి నియంత్రణ సాధించాడు. 

వ్యతిరేకుల కంటే వేగంగా ఆలోచించేవాడు. పనిచేసేవాడు. మధ్య భారతంలోని పాక్షిక స్వతంత్ర సంస్థానాలు ఆఖరికి వాటి అన్నిటికన్నా మొండిదైన చిత్తోర్ కూడా స్వాధీనంలోకి వచ్చింది. గుజరాత్ సముద్రానికి దారులు తెరిచింది. 

బెంగాల్​, గోండ్వానా, ఒరిస్సా కూడా ఆయనవే అయ్యాయి. ఆయన చివరి సంవత్సరాలలో తన సామ్రాజ్యంలో దక్కన్​ను కలుపుకోవడానికి నర్మదా నదిని దాటాడు. అక్కడ ఆయనను అడ్డుకున్నవాళ్లను కూడా ఓడించాడు. అయినప్పటికీ అలాంటి విజయం ఆయనను విజేతలందరిలోనూ అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది. 

కానీ, గొప్ప సైనికునిగా, రాజనీతిజ్ఞునిగా కలగలిసిన అక్బర్​ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అక్బర్ 1605లో అతిసార వ్యాధికి గురయ్యాడు. అక్టోబర్​లో సలీంను పిలిచి సైగలతోనే హుమయూన్ కరవాలం ధరించమన్నాడు. దాంతో సింహాసనాన్ని అధిరోహించడం నిశ్చయమైంది. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆయన మరణించాడు. ఆ తర్వాత కూడా ఆయన సామ్రాజ్యం బతికే ఉంది.

- మేకల మదన్​మోహన్​ రావు,కవి, రచయిత-