గ్రీన్ ల్యాండ్.. ఐస్ ముక్క కాదు

గ్రీన్ ల్యాండ్.. ఐస్ ముక్క కాదు

అది ప్రపంచంలోనే అతిపెద్ద ఐల్యాండ్​. ఆర్కిటిక్‌‌‌‌ మంచు ప్రాంతంలోని అందమైన భూభాగం. విశాలమైన మంచు పొరలు, ఐస్‌‌‌‌బర్గ్‌‌‌‌లు, ఆకట్టుకునే ఇన్యూట్ ప్రజల సంస్కృతి దాని సొంతం. అలాంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ను ఎలాగైనా దక్కించుకుంటామని ట్రంప్ పదే పదే చెప్తున్నాడు. ఇంతకీ గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ మీద అమెరికా కన్ను ఎందుకు పడింది? అది ప్రపంచాన్ని ఎందుకు ఆకర్షిస్తోంది? 

ఆర్కిటిక్‌‌‌‌లో ఉన్న గ్రీన్​ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపంగా గుర్తింపు పొందింది. దీని విస్తీర్ణం దాదాపు 2.2 మిలియన్ చదరపు కి.మీ (836,330 చదరపు మైళ్ళు). అంటే ఇది జర్మనీ కంటే దాదాపు ఆరు రెట్లు పెద్దది. కానీ.. జనాభా 57 వేలు మాత్రమే. అక్కడ ఎక్కువగా స్వదేశీ ఇన్యూట్ ప్రజలు ఉంటున్నారు. ఇది ఒక ప్రత్యేక దేశం కాదు. డెన్మార్క్ దేశంలో భాగంగా ఉంది. కానీ.. 2009 నుంచి దానికి ప్రత్యేక పార్లమెంటు (ఇనాట్సిసార్టుట్), ప్రభుత్వం ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ.. లాంటివన్నీ డెన్మార్క్ చూసుకుంటోంది. అది సబ్సిడీల రూపంలో గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌కు సంవత్సరానికి 500 మిలియన్‌‌‌‌ డాలర్ల వరకు ఇస్తోంది. అక్కడి ప్రజలు కూడా డెన్మార్క్‌‌‌‌తో కలిసి ఉండడానికే ఇష్టపడుతున్నారు.  

అమెరికాకు ఎందుకు? 

గ్రీన్‌‌‌‌ల్యాండ్ ఉత్తర అట్లాంటిక్, ఆర్కిటిక్‌‌‌‌ మహాసముద్రాల మధ్య ఉంది. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలోనే ఉన్నప్పటికీ రాజకీయంగా యూరప్‌‌‌‌లోని డెన్మార్క్ దేశానికి చెందిన ప్రాంతం. అయితే.. అమెరికాపై మిసైల్ దాడులు జరిగినప్పుడు ముందుస్తుగా హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఇది అనువైన ప్రాంతం. అంతేకాదు.. ఈ రీజియన్ గుండా వెళ్లే నౌకల కదలికలను గమనించేందుకు కూడా ఇదే సరైన ప్రదేశం. అందుకే అమెరికా కన్ను గ్రీన్‌‌‌‌ల్యాండ్ మీద పడింది. 

కోల్డ్‌‌‌‌ వార్‌‌‌‌‌‌‌‌ టైంలో అమెరికా ఈ ద్వీపంలో అణు క్షిపణులను మోహరించాలని ప్లాన్‌‌‌‌ చేసింది. కానీ, ఇంజనీరింగ్ సమస్యలు, డెన్మార్క్ అభ్యంతరాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడేమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ను కొనుగోలు చేస్తామని లేదా నియంత్రణలోకి తీసుకుంటామని పదేపదే ప్రకటించాడు. జాతీయ భద్రత, ఖనిజ వనరులు, చైనా,- రష్యాల ప్రభావాన్ని అరికట్టడం కోసం అమెరికా దీన్ని దక్కించుకోవాలి అనుకుంటుంది. కానీ.. ఆ ప్రతిపాదనను గ్రీన్‌‌‌‌ల్యాండ్, డెన్మార్క్ తిరస్కరించాయి.

 గ్రీన్‌‌‌‌ల్యాండ్ ప్రధాని ముట్టియా హీల్‌‌‌‌మాన్ ‘‘మా సార్వభౌమత్వం అమ్మకానికి లేదు” అని ప్రకటించాడు. అమెరికా ఇప్పటికే గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌లో థులే ఎయిర్ బేస్‌‌‌‌ను నిర్వహిస్తోంది. 1951 ఒప్పందం ప్రకారం.. ఈ బేస్‌‌‌‌ని మిస్సైల్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్‌‌‌‌కు వాడుతున్నారు.  

మంచు పొర

గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ భూభాగం దాదాపు 80శాతం ప్రాంతం మంచు పొరతో కప్పబడి ఉంది. ఇది అంటార్కిటికా తర్వాత ప్రపంచంలోని రెండో అతిపెద్ద మంచు ప్రాంతం. దాదాపు 3 కిలోమీటర్ల మందంతో మంచు ఉంటుంది. కొన్నేండ్ల నుంచి అది వేగంగా కరిగిపోతోంది. ఈ సంవత్సరం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇది పూర్తిగా కరిగిపోతే సముద్ర మట్టాలు 7 మీటర్లు పెరిగే ప్రమాదం ఉంది. 

హిమానీనదాలు, ఐస్‌‌‌‌బర్గ్‌‌‌‌లు ఈ ప్రాంతానికి స్పెషల్‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌. ఇక్కడ  తీవ్రమైన చలి ఉంటుంది. డిసెంబర్ నుంచి -ఫిబ్రవరి మధ్య దక్షిణ తీరాల్లో –5 నుంచి –15 సెంటీగ్రేడ్‌‌‌‌లు నమోదవుతాయి. ఉత్తర భాగాల్లో టెంపరేచర్లు –20 నుంచి –40 సెంటిగ్రేడ్‌‌‌‌ల వరకు పడిపోతాయి. ఇక్కడ కాలుష్యం చాలా తక్కువ. దేశంలో ఏ నదిలో నీటినైనా ఫిల్టర్ చేయకుండా తాగొచ్చు. 

తీరప్రాంతాల్లో 

గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌లోని రోడ్లు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే.. ప్రధాన నగరాలన్నీ తీర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఏ రెండు పెద్ద పట్టణాల మధ్య కూడా రోడ్లు లేవు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటర్నల్‌‌‌‌ రోడ్లు మాత్రమే ఉంటాయి. కార్లు, బస్సులు, టాక్సీలు కూడా పట్టణాల లోపలే తిరుగుతాయి. అందుకే ఇక్కడ కార్ల కంటే పడవలే ఎక్కువ. గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌లో మొత్తం రోడ్ల పొడవు సుమారు 150–400 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అందులో చాలా భాగం రాజధాని నూక్‌‌‌‌లోనే ఉన్నాయి. ఇక్కడివాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు బోట్లు, విమానం, హెలికాప్టర్ లాంటివి వాడతారు. ఇక్కడ అతి పొడవైన రోడ్డు 35 కి.మీ. ఇది కెల్లీవిల్లే అనే పరిశోధనా కేంద్రం నుంచి కాంగర్లుసువాక్ అనే ప్రాంతం మీదుగా ఉంది. దీనిని వోక్స్‌‌‌‌వ్యాగన్ కంపెనీ వేయించింది. వాళ్ల కార్లను టెస్ట్‌‌‌‌ చేయడానికి వేసిన కోల్డ్ కార్ టెస్ట్ ట్రాక్‌‌‌‌ ఇది. 

ఆ పేరు ఎందుకొచ్చింది? 

ఐస్‌‌‌‌ల్యాండ్‌‌‌‌కు చెందిన ఎరిక్ ది రెడ్ అనే వ్యక్తి హత్యలు చేయడంతో మూడేండ్ల( క్రీ.శ. 982–85)పాటు రాజ్య బహిష్కరణకు గురవుతాడు. అప్పుడు అతను ఉండడానికి కొత్త ప్రాంతం కోసం వెతుకుతూ గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌కు చేరుకున్నాడు. తన కుటుంబం, బానిసలతో అక్కడే స్థిరపడిపోతాడు. అయితే.. ఈ ప్రాంతంలో 80 శాతం మంచు ఉన్నప్పటికీ ఎండాకాలంలో మిగిలిన కొంత భూమి మొక్కలతో పచ్చగా కనిపిస్తుంది. అందుకే దీనికి గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ అని పేరుపెట్టాడు. కొందరు మాత్రం ఐస్‌‌‌‌లాండ్, నార్వే నుంచి వలసదారులను ఆకర్షించేందుకు ఈ పేరు పెట్టాడని చెప్తుంటారు. ఎందుకంటే గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ అనే పేరు వినగానే ప్రజలు సారవంతమైన నేల, జీవనానికి అనుకూలమైన ప్రదేశంగా భావించి వచ్చే అవకాశం ఉంటుందని ఎరిక్ అనుకున్నాడు. 

 

►ALSO READ | ఈ సండే స్పెషల్ టోఫు.. పోషకాల్లో తోపు!.ఈ వెరైటీ రెసిపీలు ఒక్కసారి ట్రై చేయండి

 

“ఇగ్లూ” అక్కడి నుంచి వచ్చిందే!

గ్రీన్‌‌‌‌ల్యాండ్ అధికారిక భాష గ్రీన్‌‌‌‌లాండిక్. కానీ, జనాభాలో ఎక్కువమంది ఇంగ్లీష్, డానిష్ కూడా మాట్లాడతారు.‘‘ఇగ్లూ” అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ వాడుతుంటారు. అది గ్రీన్‌‌‌‌లాండిక్  నుంచే వచ్చింది. ‘కయాక్’ కూడా ‘కజాక్’ అనే గ్రీన్‌‌‌‌ల్యాండిక్‌‌‌‌ పదం నుంచి వచ్చింది. ఇన్యూట్ వేటగాళ్లు మొదటిసారి ఈ పదాన్ని వాడారు. అక్కడి సంప్రదాయ కజాక్‌‌‌‌లను చేపల వేట కోసం వాడేవాళ్లు. మనం చూస్తున్న కయాక్‌‌‌‌ల కంటే అవి చాలా చిన్నవి, ఇరుకైనవి. ప్రతి వేటగాడు తన శరీరానికి సరిపోయేలా కస్టమైజ్‌‌‌‌ చేసుకుంటుంటాడు. 

చేపల వేట 

గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడింది. కానీ, చేపలు, సీఫుడ్‌‌‌‌ మాత్రం పెద్దమొత్తంలో ఎగుమతి చేస్తోంది. మత్స్య పరిశ్రమ ఈ ద్వీపానికి ప్రధాన ఆర్థిక వనరు. ఆర్కిటిక్ చార్, కాడ్, సాల్మన్, హాలిబట్ లాంటి చేప జాతులు ఎక్కువగా ఉన్నాయి. తిమింగలాలు, సీల్స్ లాంటి వాటిని కూడా వేటాడుతారు. కానీ.. వాటి మాంసాన్ని ఎగుమతి చేయడానికి అనుమతి లేదు. స్థానికంగా మాత్రమే తినాలి. నీలి తిమింగలాన్ని అంతరించిపోతున్న  జాతుల్లో చేర్చారు. కాబట్టి దాన్ని వేటాడడంలేదు.  

టూరిస్ట్‌‌‌‌లకు

దీని రాజధాని నూక్‌‌‌‌ టూరిస్ట్‌‌‌‌లకు బెస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌.గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ మొత్తం జనాభాలో 25 శాతం మంది రాజధానిలోనే నివసిస్తున్నారు. ఈ ద్వీపంలో ఇదే పెద్ద నగరం. ఇక్కడ మ్యూజియంలు, రకరకాల ఫుడ్స్‌‌‌‌, కేఫ్‌‌‌‌లు, ఫ్యాషన్ బోటిక్‌‌‌‌లు పుష్కలంగా ఉన్నాయి. నేషనల్ మ్యూజియం ఆఫ్ గ్రీన్‌‌‌‌ల్యాండ్ ఆ దేశాన్ని పరిచయం చేస్తుంది. అయితే.. గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌కు డైరెక్ట్‌‌‌‌గా వెళ్లడం కుదరదు. డెన్మార్క్ లేదా ఐస్‌‌‌‌ల్యాండ్‌‌‌‌ నుంచి మాత్రమే అక్కడికి ఫ్లైట్స్‌‌‌‌ నడుస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడున్న అంతర్జాతీయ విమానాశ్రయాలు రెండో ప్రపంచ యుద్ధం టైంలో వైమానిక స్థావరాలుగా ఉండేవి. 

భూమి కొనలేరు

గ్రీన్‌‌‌‌ల్యాండ్‌‌‌‌లో ఎవరూ భూమిని కొనలేరు. అంటే అక్కడ భూమి అంత ఖరీదైనది అనేకుంటారేమో! కాదు. భూమి మొత్తం  ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, ఇండస్ట్రీ పెట్టాలి అనుకుంటే ముందుగా స్థానిక మున్సిపాలిటీకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అప్పుడు ప్రభుత్వం ‘భూమి వినియోగ హక్కు’ ఇస్తుంది. దానిపై ఎలాంటి యాజమాన్యపు హక్కులు ఉండవు. ఇది దీర్ఘకాలిక లీజ్ లాంటిది. అధికారులు కేటాయించిన స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి. పెద్ద పెద్ద నగరాల్లో దీనికి వెయిటింగ్‌‌‌‌ పీరియెడ్‌‌‌‌ ఉంటుంది. తమవంతు వచ్చినప్పుడే భూమి కేటాయిస్తారు. 

సూర్యుడు అస్తమించడు

ఇక్కడ వేసవిలో సూర్యుడు అస్తమించడు. కొన్ని ప్రాంతాల్లో నెలపాటు మరికొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు నెలలపాటు ఇదే పరిస్థితి. అంటే రాత్రి 12 గంటలకు కూడా సూర్యుడు కనిపిస్తాడు. ఉత్తర ముఖ్యంగా ఇలులిస్సాట్, ఉమ్మన్నాక్ ప్రాంతాల్లో అయితే.. ఇలాంటి వాతావరణం కొన్ని నెలల పాటు ఉంటుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు టూరిస్ట్‌‌‌‌లు క్యూ కడుతుంటారు. ఇక శీతాకాలంలో అంటే నవంబర్ నుంచి జనవరి వరకు కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు ఉదయించడు. రోజంతా తక్కువ వెలుతురుగా లేదంటే మబ్బులు పట్టినట్టుగా ఉంటుంది.