ఈ సండే స్పెషల్ టోఫు.. పోషకాల్లో తోపు!.ఈ వెరైటీ రెసిపీలు ఒక్కసారి ట్రై చేయండి

ఈ సండే స్పెషల్ టోఫు.. పోషకాల్లో తోపు!.ఈ వెరైటీ రెసిపీలు ఒక్కసారి ట్రై చేయండి

టోఫు.. చూడ్డానికి అచ్చం పనీర్​లానే ఉంటుంది. కానీ, టేస్ట్ కొంచెం డిఫరెంట్​గా ఉంటుంది. ఇది మొక్కల నుంచి వచ్చిన ప్రొటీన్​. కాబట్టి పోషకాల్లో మాత్రం పనీర్​కి ఏ మాత్రం తీసిపోదు. దీన్ని వీగన్స్​ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, ఫాస్పరస్​, గుడ్ ఫ్యాట్స్ ఇలా చాలా పోషకాలు ఉంటాయి. ఎముకలు, గుండె, కండరాల ఆరోగ్యానికీ, బరువును అదుపులో ఉంచడంలో టోఫు.. తోపు! మరింకేం.. టోఫుతో ఏమేం వెరైటీలు చేయాలో ఇక్కడ చదివేయండి. 

బుర్జీ

కావాల్సినవి :
టోఫు – పావు కిలో
నెయ్యి – ఐదు టేబుల్ స్పూన్లు
జీలకర్ర, జీలకర్ర పొడి – ఒక్కోటి అర టీస్పూన్
ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు
ఉప్పు – సరిపడా
క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు
అల్లం, కారం – ఒక టీస్పూన్
పచ్చిమిర్చి, టొమాటోలు – మూడు
పసుపు, గరం మసాలా – ఒక్కోటి పావు టీస్పూన్
నిమ్మరసం, కొత్తిమీర – కొంచెం

తయారీ :

ఒక గిన్నెలో టోఫును వేసి వేడి నీళ్లు పోసి కాసేపు పక్కన ఉంచాలి. తర్వాత పాన్​లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. ఆపై క్యాప్సికమ్, అల్లం తరుగు కూడా వేయాలి. పచ్చిమిర్చి, టొమాటో తరుగు వేసి కలపాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి పసుపు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. ఇందులో టోఫును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు లేదా తురిమి వేయాలి. చివరిగా ఉప్పు వేసి నిమ్మరసం, కొత్తిమీర చల్లాలి.

మసాలా

కావాల్సినవి :
టోఫు – 200 గ్రాములు
పెరుగు – ఒక టేబుల్ స్పూన్
కర్రీ మసాలా – 
రెండు టీస్పూన్లు
కారం – ఒక టీస్పూన్
గరం మసాలా – 
పావు టీస్పూన్
ఉప్పు, నూనె – సరిపడా
చక్కెర – చిటికెడు
బాదం పొడి లేదా కార్న్​ ఫ్లోర్ – ఒకటిన్నర టీస్పూన్
కొత్తిమీర, నిమ్మరసం – కొంచెం

తయారీ :

టోఫును క్లాత్​లో చుట్టి కాసేపు పక్కన ఉంచితే దానిలో ఉన్న తేమ పోతుంది. తర్వాత ముక్కలుగా కట్ చేయాలి.  ఒక గిన్నెలో పెరుగు, కర్రీ మసాలా, కారం, గరం మసాలా, ఉప్పు, చక్కెర, బాదం పొడి లేదా కార్న్​ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నూనె కూడా వేసి కలిపాక టోఫు ముక్కలను వేసి వాటికి మసాలా పట్టించాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో టోఫులను పెట్టి వేగించాలి. రెండు వైపులా టోఫులు వేగాక కొత్తిమీర, నిమ్మరసం చల్లాలి.

రైస్

కావాల్సినవి :
టోఫు – అర కిలో 
బాస్మతీ రైస్ – ఒకటిన్నర కప్పు 
ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు
వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్
ఒరెగానో, రోస్​మేరీ ఆకులు, థైమ్​ – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున (ఇవన్నీ ఆన్​లైన్​లో దొరుకుతాయి)
ఉప్పు, నూనె, నీళ్లు – సరిపడా
టొమాటో గుజ్జు – ఒక కప్పు
కొత్తిమీర, మిరియాల పొడి – కొంచెం


తయారీ :

టోఫును ముక్కలుగా కట్ చేసి క్లాత్​ మీద పెట్టాలి. బాస్మతీ రైస్​ని కడిగి అరగంటసేపు నానబెట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి టోఫులు వేసి వాటిపై ఉప్పు చల్లి వేగించాలి.  వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్​లో ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు వేసి వేగించాలి. వెల్లుల్లి తరుగు, థైమ్, ఒరెగానో, రోస్​మేరీ ఆకులు వేసి కలపాలి. తర్వాత టొమాటో గుజ్జు వేయాలి. ఆ మిశ్రమం దగ్గర పడ్డాక నానబెట్టిన బియ్యం, ఉప్పు వేసి నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి దాదాపు 20 నిమిషాలు ఉడికించాలి. చివరిగా అందులో టోఫులను వేసి, కొత్తిమీర, మిరియాల పొడి చల్లి బాగా కలపాలి. ఈ రెసిపీలో నీళ్లకు బదులు కూరగాయలు ఉడికించిన నీటిని కూడా వాడితే మరింత టేస్టీగా, ఆరోగ్యంగా ఉంటుంది.