
సుమంత్ ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మించారు. మే 26న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ ‘డిగ్రీ అయ్యాక ఎస్‌ఐకి ప్రిపేర్ అవ్వాలనేది మా ఇంట్లో వాళ్ల ఆలోచన. కానీ కాలేజీలో చదువుకుంటూ ‘పిల్ల పిల్లగాడు’ షార్ట్ ఫిల్మ్ తీశాం. అది బాగా రీచ్ అయ్యింది. దీంతో చాయ్ బిస్కెట్ అనురాగ్, శరత్ అన్న పిలిచి.. ‘మంచి కథ రాయి సినిమా తీద్దాం’ అన్నారు. కథ రాశాను. కథని ఎలా చెప్పాలో కూడా తెలీదు. దాదాపు ఆరు గంటల పాటు ప్రతీది వివరించి చెప్పాను. వాళ్లకు బాగా నచ్చింది. అలా ఇందులో రైటర్, డైరెక్టర్‌గా ముందు సైన్ చేశా. నేను చేసిన పాత్ర కోసం చాలా ఆడిషన్స్ చేశాం.
కానీ ఎవరూ సరిగ్గా కుదరలేదు. షూట్‌కి వెళ్ళే పది రోజులు ముందు ఇందులో నటుడిగా చేరాను. ఇదంతా ఛాయ్ బిస్కెట్ నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం వలనే సాధ్యమైంది. సినిమాని సింక్ సౌండ్‌లో షూట్ చేశాం. ఇందులో వున్న కుర్రాళ్ళ ఎనర్జీని తెరపై ట్రాన్స్ లేట్ చేయడానికి ప్రయత్నించారు. ఊర్లో ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలనుకునే కుర్రాళ్ళ కథ ఇది. దానికి తగ్గట్టు ‘మేమ్ ఫేమస్’ అని టైటిల్ పెట్టాం. దాదాపు 35 మంది కొత్త నటీనటులతో చేశాం. నా అసలు పేరు సుమంత్ రెడ్డి. ప్రభాస్ ఫ్యాన్‌ని. అందుకే సుమంత్ ప్రభాస్ పేరుతో ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశాను. అదే స్ర్కీన్ నేమ్‌గా ఉంచుకున్నా’ అని చెప్పాడు.