స్టాఫ్ నర్స్‌‌ పోస్టుల మెరిట్ లిస్ట్​ రిలీజ్​

స్టాఫ్ నర్స్‌‌ పోస్టుల మెరిట్ లిస్ట్​ రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: స్టాఫ్ నర్స్‌‌ పోస్టుల మెరిట్ లిస్ట్‌‌ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌‌ఎస్‌‌ఆర్‌‌‌‌బీ) గురువారం విడుదల చేసింది. తొలుత పరీక్ష రాసిన అభ్యర్థుల అందరి మార్కుల వివరాలతో కూడిన 1,419 పేజీల లిస్టును బోర్డు వెబ్‌‌సైట్‌‌లో ( https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ) అందుబాటులో ఉంచింది. ఆ తర్వాత మెరిట్‌‌ లిస్టులో ఉన్న అభ్యర్థుల హాల్‌‌ టికెట్ నంబర్లతో కూడిన మరో లిస్టును వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్ చేసింది. 

మెరిట్‌‌ లిస్టులో ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ నెల 30వ తేదీ నుంచి ఫిజికల్‌‌గా వెరిఫై చేస్తామని బోర్డు ప్రకటించింది. బండ్లగూడ జాగిర్‌‌‌‌లోని ఎక్సైజ్‌‌ అకాడమీలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వెరిఫికేషన్ జరుగుతుందని పేర్కొంది. ఎవరెవరు ఏ రోజు వెరిఫికేషన్ కు రావాలో అభ్యర్థులకు తెలిసేలా నోట్ విడుదల చేసింది. దరఖాస్తు సమయంలో అప్‌‌లోడ్ చేసిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌‌కు రావాలని అభ్యర్థులకు సూచించింది. రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, పాస్‌‌ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని రావాలని నోట్​లో పేర్కొంది. 

జాప్యం లేకుండా భర్తీ ప్రక్రియ

ప్రభుత్వ దవాఖాన్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్‌‌ నర్స్‌‌ పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌‌‌‌లో నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఏడాది ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించగా.. 38,674 మంది హాజరయ్యారు. కానీ, పరీక్ష ఫలితాల విడుదలలో అప్పటి బీఆర్‌‌‌‌ఎస్ సర్కార్ జాప్యం చేసింది. ఈలోగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. ప్రభుత్వ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న మరో 1,890 పోస్టులను కూడా ఇదే నోటిఫికేషన్‌‌తో కలిపి భర్తీ చేయాలని ఆఫీసర్లు, నర్సింగ్ అసోసియేషన్లు కొత్త ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. ఫలితాలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరాయి. 

ఈ అంశాలపై రివ్యూ చేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. పాత నోటిఫికేషన్‌‌లోని 5,204 పోస్టులతో పాటు 1,890 పోస్టులను కూడా కలిపి మొత్తం 7,094 పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 12వ తేదీనే రాత పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం గురువారం మెరిట్ లిస్టును రిలీజ్ చేశారు. రాత పరీక్ష, వెయిటేజీతో కలిపి అత్యధికంగా ఓ అభ్యర్థి 89.65 మార్కులు సాధించి.. స్టేట్ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంది. జీరో మార్కులతో నలుగురు అభ్యర్థులు చివరి స్థానాల్లో నిలిచారు.