- సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్ కెప్టెన్గా మ్యాచ్లో పాల్గొననున్న రేవంత్
- హాజరుకానున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
- రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్
హైదరాబాద్ / ఉప్పల్ / న్యూఢిల్లీ, వెలుగు: వరల్డ్ ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీతో శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మెస్సీ టీమ్ ప్రత్యర్థి జట్టు ‘సింగరేణి ఆర్ఆర్ 9’ టీమ్ కెప్టెన్గా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మ్యాచ్ టికెట్లన్నీ ఆన్లైన్లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానున్నది. మెస్సీ కెప్టెన్గా వ్యవహరించే అపార్నా మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్గా వ్యవహరించే సింగరేణి ఆర్ఆర్ 9 టీమ్ ఢీకొంటుంది. గంట పాటు జరిగే ఈ మ్యాచ్లో చివరి 5 నుంచి 10 నిమిషాల ఆటలో మాత్రమే రెండు టీమ్‌ల కెప్టెన్లు పాల్గొంటారు.
సీఎం రేవంత్ రెడ్డీ జెర్సీ నెంబర్ 9, మెస్సీ జెర్సీ నెంబర్ 10 ధరిస్తారు. -మెస్సీ టీమ్‌లో పది మంది అండర్ ప్రివిలేజ్డ్, ఐదుగురు టాలెంటెడ్ ప్లేయర్లు పాల్గొంటారు. మ్యాచ్ అనంతరం మెస్సీ పాల్గొనే పెనాల్టీ షూటవుట్ కూడా నిర్వహిస్తారు. చారిటీ మ్యాచ్ కోసం ఒక్కో టికెట్‌ను రూ.2,250 నుంచి రూ.10 వేలకు పైగా ధరలకు ఆన్లైన్లోనే అన్నీ టికెట్లు అమ్మేశారు. ఈ మ్యాచ్ ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్కు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్నేపథ్యంలో స్టేడియం వద్ద రాచకొండ సీపీ సుధీర్ బాబు ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.
చారిటీ కోసం మెస్సీతో సెల్ఫీకి రూ.9.95 లక్షలు
అర్జెంటీనాకు చెందిన మెస్సీ 14 ఏండ్ల తర్వాత ‘గోట్ ఇండియా టూర్-2025’ పర్యటనలో భాగంగా మన దేశానికి వస్తున్నారు. 2011లో అర్జెంటీనా టీమ్‌తో కలిసి కోల్‌కతాలో వెనిజువెలా టీమ్‌తో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ప్రస్తుతం ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో మెస్సీ పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా కోల్‌కతా, హైదరాబాద్‌లో చారిటీ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న ఉదయం 1.30 గంటలకు మెస్సీ కోల్‌కతా చేరుకుంటారు. 11.15 తర్వాత యువ భారతీ స్టేడియానికి మెస్సీ చేరుకొని.. మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు ఫ్రెండ్లీ ఫెసిలిటేషన్ మ్యాచ్లో మెస్సీ పాల్గొంటారు.
ఆ తర్వాత షారూఖ్ ఖాన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీ, జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఇదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కోల్కత్తా నుంచి బయల్దేరి మధ్యాహ్నం 4 గంటల వరకు హైదరాబాద్చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ఫలక్నామా ప్యాలెస్‌కు చేరుకొని.. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. తనతో కలిసి సెల్ఫీలు దిగిన వారి నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.9.95 లక్షల చొప్పున చారిటీ కోసం డబ్బులు వసూలు చేస్తారు. ఇది ఫుట్‌బాల్‌ను ప్రమోట్ చేస్తూనే.. యూనిసెఫ్ చారిటీకి సహాయపడుతుందని నిర్వాహకులు తెలిపారు. పర్యటన చివరి రోజు 15న ఢిల్లీలో ప్రధాని మోదీతో మెస్సీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

