V6 News

మెస్సీ మ్యాచ్కు టైట్ సెక్యూరిటీ.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ శివధర్రెడ్డి

మెస్సీ మ్యాచ్కు టైట్  సెక్యూరిటీ.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ శివధర్రెడ్డి

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​స్టేడియంలో ఈ నెల13న జరగనున్న సీఎం రేవంత్​రెడ్డి, మెస్సీ టీమ్​ల  ఫ్రెండ్లీ ఫుట్​బాల్​మ్యాచ్​కు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ శివధర్​రెడ్డి ఆదేశించారు. స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రత, ట్రాఫిక్​నియంత్రణ, సేవలు, తదితర అంశాలపై చర్చించారు.  ఈ సందర్భంగా పలు విభాగాల అధికారులకు సూచనలు చేశారు. ప్రేక్షకులకు సంబంధించిన మార్గదర్శకాలను, భద్రతా నియమాలను విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. 39 వేల సామర్థ్యం కలిగిన స్టేడియంలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పాసులు ఉన్నవారే స్టేడియానికి వచ్చేలా చూడాలని, ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. అడిషనల్​డీజీపీ మహేశ్​ భగవత్, డీజీ ఎస్పీఎఫ్​ స్వాతి లక్రా, అడిషనల్​డీజీపీ(సీఐడీ) చారు సిన్హా, అడిషనల్​ డీజీపీ(ఇంటెలిజెన్స్​) విజయ్​కుమార్,  డీజీ విక్రమ్​సింగ్​మాన్​, జాయింట్​ సీపీ జోయల్​ డేవిస్, రాచకొండ సీపీ సుధీర్​బాబు, మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, నార్కొటిక్​ బ్యూరో ఎస్సీ పద్మజ, పలువురు అధికారులు ఉన్నారు.