వేలాది ఉద్యోగుల్ని తొలగించే యోచనలో మెటా!

వేలాది ఉద్యోగుల్ని తొలగించే యోచనలో మెటా!

ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే దీనిపై స్పందించేందుకు మెటా నిరాకరించింది. 

సెప్టెంబర్ క్వార్టర్ లో నిరాశజనక ఫలితాలు నమోదవుతాయని భావిస్తున్న మెటా వచ్చే ఏడాది నాటికి కంపెనీ స్టాక్ వాల్యూ 67బిలియన్ డాలర్ల మేర తగ్గుతుందని అంచనా వేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే మెటా అర ట్రిలియన్ డాలర్ల మేర నష్టాన్ని మూటగట్టుకుంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిరేటు తగ్గడం, టిక్ టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ, యాపిల్ ప్రైవసీ పాలసీలో చేసిన మార్పులు, మెటావర్స్ కోసం భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉండటం తదితర అంశాలు తలకు మించిన భారాన్ని మోపుతున్నట్లు మెటా చీఫ్ జూకర్ బర్గ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మెటావర్స్ కోసం భారీ మొత్తంలో పెడుతున్న పెట్టుబడి నుంచి పదేళ్ల తర్వాత గానీ రాబడి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కాస్ట్ కట్టింగ్లో భాగంగా ఉద్యోగ నియామకాలను పక్కనబెట్టడంతో పాటు ఉన్న ఉద్యోగులను సైతం సాగనంపాలని జూకర్ బర్గ్ నిర్ణయించినట్లు సమాచారం.

 

నిజానికి ఉద్యోగాల కోత గురించి జూకర్ బర్గ్ ఈ ఏడాది అక్టోబర్లోనే స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. త్రైమాసిక ఫలితాల వెల్లడి సమయంలో భారీ పెట్టుబడుల దృష్ట్యా 2023లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గించే అవకాశంలేకపోలేదని ఆయన చెప్పారు. మరోవైపు మెటా షేర్ హోల్డర్లు సైతం పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగుల సంఖ్య కుదించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటి దృష్యా మెటా ఉద్యోగుల కోత నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.