అమెరికాలో న్యూమో వైరస్ కలకలం

అమెరికాలో న్యూమో వైరస్ కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. మెటాప్ న్యూమో వైరస్ లేదా హెచ్ఎంపీవీ అనే మహమ్మారి యూఎస్ అంతటా వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకినవాళ్లలో జలుబు లక్షణాలు కనిపిస్తాయని, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

ఓ పక్క కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, న్యూమో వైరస్ దేశవ్యాప్తంగా పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మార్చి నెలలో చేసిన మొత్తం శాంపిల్ టెస్టుల్లో 11 శాతం న్యూమో వైరస్ పాజిటివ్ వచ్చాయని, గతంలో వ్యాపించినదానితో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువని చెప్పింది. 

ఈ వైరస్ సోకిన చాలామందిలో ఎలాంటి లక్షణాలు బయటపడట్లేదని, ఆరోగ్యం దెబ్బతింటున్నదాని బట్టి సాధారణ ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారని సీఎన్ఎన్ రిపోర్టులో పేర్కొంది. అన్ని వయసుల వారిపై ఎఫెక్ట్ చూపించే ఈ వైరస్​కు ప్రస్తుతం ఎలాంటి మెడిసిన్ లేదని తెలిపింది. 

న్యూమోవిరిడే ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్​ను మొదటిసారిగా 2001లో సైంటిస్టులు గుర్తించారు. కరోనా మాదిరిగానే ఈ వైరస్ వ్యాపిస్తుందని, మాస్క్ పెట్టుకోవడం, శుభ్రంగా ఉండటంతో నివారించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు.