బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

   బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి  శుక్రవారం నాటికి  వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ  వెల్లడించింది.   ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతోందని పేర్కొంది. శుక్రవారం ఉదయానికి ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది తుఫానుగా మారే అంశంపై నేటి సాయంత్రానికి స్పష్టత రానుంది. 

తెలంగాణలో మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ  తెలిపింది. ఉత్తర ఈశాన్య జిల్లాల మీద వర్షాల ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చింది.   గంటకు 30-నుంచి40 కిలోమీటర్ల వేగంతో  ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురస్తాయంది.  

ఈరోజు తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంది.

కాగా నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసరాలను తాకాయి. తాజాగా తుఫాన్‌ ప్రభావంతో అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్‌లోని మరిన్ని ప్రాాంతాలకు విస్తరించనున్నాయి. మే 30 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.