-announced-that-the-country-will-receive-normal-rainfall-this-year_3vJlReMKoG.jpg)
- జూన్ 4న కేరళకు రుతుపవనాలు : వాతావరణ శాఖ
- 96 శాతం రెయిన్ ఫాల్ నమోదవుతుందని అంచనా
న్యూఢిల్లీ:ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం ప్రకటించింది. జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉన్నా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 4 నాటికి కేరళకు వస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.
అదేవిధంగా, ఈ ఏడాది దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతంలో 96 శాతం రెయిన్ ఫాల్ నమోదయ్యే చాన్స్ ఉందని వివరించారు. రుతుపవనాలు సాధారణం (94 నుంచి 106 శాతం) కంటే 92శాతం తక్కువగా రావడంతో నార్త్‌వెస్ట్ ప్రాంతంలో వర్షాలు కొద్దిగా తక్కువగా కురిసే అవకాశాలు ఉంటాయని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
నార్త్ వెస్ట్ ఇండియాలో నార్మల్ కంటే తక్కువ
దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) చీఫ్ డి.శివానంద పాయ్ వెల్లడించారు. ముఖ్యంగా దేశంలోని దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలతో పాటు నార్త్‌వెస్ట్ ఇండియాలోని ఐసోలేటెడ్ ఏరియాల్లో ఈ పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఇక ఇండియాలోని మిగిలిన ప్రాంతాల్లో దాదాపు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. భూమధ్య రేఖా ప్రాంతంలోని పసిఫిక్ మహా సముద్రం వేడెక్కడంతో ఎల్‌నినో ఏర్పడినప్పటికీ ఈ సీజన్లో సాధారణ వర్షపాతమే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
జూన్‌లో సాధారణం కంటే తక్కువే..
దేశంలో 94 నుంచి 106 శాతం వర్షాలు కురిస్తే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తామని శివానంద పాయ్ తెలిపారు. దేశంలో ఎక్కువ మంది రైతులు వర్షంపై ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారని వివరించారు. నైరుతి రుతుపవనాల కాలంలోనే సాగు విస్తీర్ణం అత్యధికంగా ఉంటుందని తెలిపారు. రుతు పవనాలు బలపడిన తర్వాత జూన్ 4 నాటికి కేరళను తాకుతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. జూన్ 1 కంటే ముందు రుతు పవనాలు వస్తాయని మాత్రం అనుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది మాన్సూన్ సాధారణంగానే ఉంటుందని వెల్లడించారు. వచ్చేవారం రోజుల్లో అరేబియా సముద్రంలో సైక్లోన్ ఏర్పడే అవకాశం లేదన్నారు. జూన్‌లో దేశంలోని ప్రతి చోటా వర్షాలు పడుతుంటే ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. వ్యవసాయ పనులు కూడా ముమ్మరం అయ్యే అవకాశాలు ఉంటాయని వివరించారు.