మరో 3 రోజులు వర్షాలు.. రెండు రోజుల్లో రాష్ట్రమంతటికీ రుతుపవనాలు: ఐఎండీ

మరో 3 రోజులు వర్షాలు.. రెండు రోజుల్లో రాష్ట్రమంతటికీ రుతుపవనాలు: ఐఎండీ
  •     పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ  
  •     శుక్రవారం దంచికొట్టిన వానలు
  •     వనపర్తి జిల్లా రేమద్దులలో 8.3 సెం.మీ. వర్షపాతం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాబోయే 3రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ రణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్​, మంచిర్యాల, నిర్మల్​, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్​, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. 

మరోవైపు రుతుపవనాలు మరిన్ని జిల్లాలకు విస్తరించాయి. మరో 2 రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్నట్టు ఐఎండీ పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్​, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, మహబూబ్​నగర్, నారాయణపేట, గద్వాల, నాగర్​కర్నూల్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లాలోని రేమద్దులలో అత్యధికంగా 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

అదే జిల్లా పానగల్, ఆత్మకూరులో 7.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. కాగా, హైదరాబాద్​లోని శేరిలింగంపల్లిలో  ఒక సెంటీమీటర్​ వర్షపాతం రికార్డయింది. కుత్బుల్లాపూర్​, నాంపల్లి, కూకట్​పల్లి, బాలానగర్, నాంపల్లి, కాప్రా, ఖైరతాబాద్​లో తేలికపాటి జల్లులు కురిశాయి.