మధ్యాహ్నం ఉక్కబోత.. రాత్రి చలి

మధ్యాహ్నం ఉక్కబోత.. రాత్రి చలి

రాబోయే వారం, పదిరోజుల పాటు వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి తెలిపారు. మధ్యాహ్నం పూట ఎండలు దంచికొడతాయని..రాత్రి సమయంలో చలివాతావరణం ఉంటుందని చెప్పారు. ద్రోణుల ప్రభావంతోనే వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలు తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఫ్లూలు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని..అలాగే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 33 డిగ్రీల  నుంచి 36 డిగ్రీల మధ్య పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వెళ్తే వాతావరణంలో భిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని శ్రావణి తెలిపారు.  

మధ్యాహ్నం ఉక్కబోతతో అల్లాడుతున్న ప్రజలు.. రాత్రి అయ్యే సరికి చలితో వణుకుతున్నారు. వాతావరణంలోని ఈ మార్పులతో రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇన్ఫ్లూయింజా వైరస్ తో ప్రతి ఇంట్లో ఒకరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇలాంటి టైంలోనే విపరీతమైన ఎండ, చలితో రోగాలు మరింత ముదురుతున్నాయి.