ORR -.. RRR మధ్యలో ఫార్మా సిటీ : రామచంద్రాపురం వరకు మెట్రో

ORR -.. RRR మధ్యలో ఫార్మా సిటీ : రామచంద్రాపురం వరకు మెట్రో

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రోను రద్దు చేయబోమని, ఫార్మాసిటీని ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దూరాన్ని తగ్గిస్తామని చెప్పారు. బెల్ నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్లు ఉంటుందని సీఎం వెల్లడించారు. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. 

నాగోల్ నుంచి ఎల్బీనగర్ మీదుగా చాంద్రాయణ గుట్ట వరకు కొత్త లైన్ ఏర్పాటు చేసి శంషాబాద్ రూట్ కు కనెక్ట్ చేస్తామని తెలిపారు.  మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు మెట్రోను పొడిగిస్తామని  చెప్పారు. ప్రస్తుతం మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు పొడిగిస్తామని తెలిపారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టు కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరని సీఎం అభిప్రాయపడ్డారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కన్నా తక్కువ అవుతుందన్నారు. 

ఫార్మాసిటీ అభివృద్ధి చేస్తం

ఫార్మాసిటీ ని అంచలంచలుగా అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని, జీరో కాలుష్యం తో ఈ క్లస్టర్లు ఉంటాయని చెప్పారు. ఆ పరిశ్రమల్లో పనిచేసే వారికి సమీపంలోనే గృహ నిర్మాణాలు కూడా ఉంటాయని వివరించారు. ఫార్మాసిటీలో పనిచేస్తున్న వాళ్లకు అవసరమైనవన్నీ అక్కడే లభించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.  గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని తెలిపారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు 
ఏర్పాటు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన పారిశ్రామిక వేత్తలతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు.  సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఈ ప్రత్యేక విశ్వవిద్యాలయాల్లో చదివిన వారికి ఉంటాయన్నారు. 

పార్టీకోసం పనిచేసిన వారికే పదవులు

పార్టీ గెలుపుకోసం పనిచేసన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని రేవంత్  రెడ్డి చెప్పారు. ఈ ఎల  3న  పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని ఆయన వివరించారు. తనకు దగ్గర బంధువులని పదవులు ఇవ్వడం ఉండదని అన్నారు. తాను  ఏది చేసిన విస్తృత స్తాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే చేస్తానని రేవంత్ రెడ్డి  చెప్పారు.  త్వరలో ప్రెస్ అకాడమీ చైర్మన్  పదవిని భర్తీ చేస్తామని, ఆ తర్వాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు