ఏడ జూసినా సారు,కారు బొమ్మలే..టాయిలెట్లను వదలలే

ఏడ జూసినా సారు,కారు బొమ్మలే..టాయిలెట్లను వదలలే

హైదరాబాద్‌‌, వెలుగుమెట్రో పిల్లర్లు, ఫుట్‌‌పాత్‌‌లు, బస్సులు, బస్టాప్​లు.. చివరికి రోడ్డు పక్కన ఉన్న టాయిలెట్లను కూడా టీఆర్​ఎస్​ లీడర్లు తమ ప్రచారానికి వాడేసుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఇంచు జాగా కూడా వదలకుండా అన్ని చోట్లా యాడ్స్​తో నింపేశారు.  ఎక్కడికక్కడ గులాబీ హోర్డింగులు పెట్టేశారు. ఎలక్షన్​ కమిషన్​ ఆఫీస్​ ముందు కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఏ ఎన్నికల్లోనైనా అడ్వర్టయిజ్‌‌మెంట్ల కోసం అన్ని పార్టీలకు స్పేస్‌‌  కేటాయించాలి. ఆయా పార్టీలు రిక్వెస్ట్‌‌ మేరకు ఎన్నికల ఆఫీసర్లు స్పేస్‌‌ కేటాయిస్తారు. ప్రతిపక్షాల ప్రతిపాదన మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌‌ ఈ మధ్యే అన్ని పార్టీలకు సమానమైన స్పేస్‌‌  ఇవ్వాలని జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లకు చెప్పింది. కానీ గ్రేటర్​ హైదరాబాద్​లో ఎక్కడ చూసినా కేసీఆర్​, కేటీఆర్, కారు బొమ్మలు.. టీఆర్​ఎస్​  ప్రచార నినాదాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల క్యాండిడేట్లు తమకూ అవకాశం ఇవ్వాలని ఆఫీసర్లను అడిగితే స్పేస్​ లేదని  చెబుతున్నారు. స్పేస్​ను లీజ్​కు తీసుకున్న సంస్థలను అడిగితే.. అన్నీ బుక్​ అయిపోయాయని అంటున్నాయి.

గ్రేటర్​ ఎలక్షన్​ పోలింగ్​ డిసెంబర్​ 1న జరుగనుంది. ఇంటింటి ప్రచారానికి టైం సరిపోయేలా లేదని చాలా మంది క్యాండిడేట్లు రోడ్‌‌‌‌ షోలు పెట్టుకున్నారు. వీటికి తోడు తమ ప్రాంతాల్లో బస్టాపులు, పిల్లర్లు, బస్సులపై అడ్వర్టయిజ్‌‌‌‌మెంట్లు వేస్తే ప్రచారానికి కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా టీఆర్​ఎస్​ అడ్వర్టయిజ్​మెంట్లే ఉండటంతో వాళ్లు మండిపడుతున్నారు. అన్ని పార్టీలకు సమాన అవకాశం ఇవ్వాల్సింది పోయి.. ఒక్క టీఆర్​ఎస్​కే ఇస్తున్నారేమిటని ప్రశ్నిస్తున్నారు. సైదాబాద్‌‌‌‌కు చెందిన బీజేపీ నాయకుడు ఒకరు బస్టాపుల్లోని షెల్టర్లను అడ్వర్టయిజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం అడిగితే.. ప్రస్తుతం స్పేస్‌‌‌‌  లేదని జీహెచ్‌‌‌‌ఎంసీ ఆఫీసర్లు సమాధానం చెప్పారు. మెట్రో పిల్లర్లు ఎక్కువగా ఉన్న డివిజన్​లో పోటీకి దిగిన కాంగ్రెస్‌‌‌‌  క్యాండిడేట్​​హోర్డింగుల కోసం ఆయన తరఫున ఓ లీడర్​ జీహెచ్‌‌‌‌ఎంసీ ఆఫీసర్లను సంప్రదించగా ఇదే సమాధానం ఎదురైంది. ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ నుంచి స్పేస్‌‌‌‌ లీజుకు తీసుకున్న అడ్వర్టయిజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సంస్థను సంప్రదిస్తే.. అన్నీ బుక్‌‌‌‌ అయిపోయాయని బదులిచ్చారు. ఓ ఇండిపెండెంట్​ అభ్యర్థి మెట్రో స్టేషన్ల వద్ద అడ్వర్టయిజ్​మెంట్​ కోసం స్పేస్‌‌‌‌ కావాలని యాడ్​ ఏజెన్సీ ఉద్యోగికి ఫోన్‌‌‌‌ చేస్తే.. సమాధానం కూడా చెప్పకుండా ఫోన్​ కట్ చేశారు.

ప్రచారానికి టాయిలెట్లను కూడా టీఆర్​ఎస్​ లీడర్లు వదలకపోవడంపై సిటిజన్లు మండిపడుతున్నారు. టాయిలెట్ల  మెయింటెనెన్స్​ను పట్టించుకోకుండా ప్రభుత్వ ప్రకటనల కోసం, టీఆర్​ఎస్​ ఎన్నికల యాడ్స్​ కోసం వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. చాలా టాయిలెట్లలో నీటి వసతి లేదు. మురుగునీరంతా బయటకు వస్తున్నది.  జూబ్లీహిల్స్​ లాంటి ప్రాంతాల్లో రోడ్లపై దగ్గర దగ్గరే టాయిలెట్స్​ను ఏర్పాటు చేశారు. అవి పబ్లిక్​కు ఉపయోగపడడం లేదు కానీ.. టీఆర్​ఎస్  యాడ్స్​కు మాత్రం మస్తుగా ఉపయోగపడుతున్నాయని జనం విమర్శిస్తున్నారు. పదిహేను రోజుల క్రితం జీహెచ్‌‌ఎంసీ ఆఫీసర్లు తమ ఖజానా నుంచి రూ. 15 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ టాయిలెట్లపై హోర్డింగులు పెట్టారు. 12 రోజుల పాటు వాటిని ప్రదర్శించిన అనంతరం.. కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ బొమ్మలతో కొత్త హోర్డింగులు అక్కడ వెలిశాయి.