
హైదరాబాద్ ఓల్డ్ సిటీకి త్వరలో మెట్రో రైల్ రాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బోనాల పండగను పురస్కరించుకుని ఆదివారం (జూలై 20) చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణ ప్రజలు అందరూ పాడి పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నానని తెలిపారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయ వల్ల ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. బోనాలు అంటే ప్రపంచ వ్యాప్తంగా వినిపించే పేరు తెలంగాణ రాష్ట్రమని అన్నారు. బోనాలు వేడుకలకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో ఆలయానికి ఒక్కో మంత్రికి కేటాయించడం సంతోషంగా ఉందన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. అలాగే, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరిగిందని గుర్తు చేశారు. ఇవాళ రెండు జంట నగరాలలోని చాలా ఆలయాల్లో బోనాలు జరుగుతున్నాయన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు రాష్ట్ర ప్రజలకు శక్తి, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకున్నానని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలన్నారు.