
- ఈ నెల 10 నుంచి అమలు చేసే యోచన
- ప్రభుత్వ అనుమతి లేకుండా టికెట్ రేట్లు పెంచే ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు: మరో వారం రోజుల్లో మెట్రో రైలు టికెట్ రేట్లు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఐదు కాదు పది కాదు.. ఏకంగా 20 నుంచి 25 శాతం పెంచే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్టు మెట్రో అధికారి ఒకరు చెప్పారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించబోయే సమావేశంలో మెట్రో ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ సమావేశంలో రేట్లు పెంచాలని నిర్ణయిస్తే మే 10వ తేదీ నుంచే రేట్లను అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
మెట్రో.. నష్టాల్లో నడుస్తున్నదని, గట్టెక్కించడానికి రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని గత కొన్నేండ్లుగా ప్రభుత్వానికి మెట్రో విజ్ఞప్తి చేస్తున్నది. అయితే, ఇప్పట్లో మెట్రో చార్జీలను పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో మెట్రోనే ప్రభుత్వ అనుమతి లేకుండా తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి చార్జీలను పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే మెట్రో పార్కింగ్ చార్జీలు, టాయిలెట్స్ చార్జీలతో విసిగిపోతున్న ప్రయాణికులకు పెంచబోయే టికెట్ల ధరలు భారంగా మారనున్నాయి.
అప్పులను సాకుగా చూపుతూ..
మెట్రో నష్టాల్లో నడుస్తున్నదని.. ఆ నష్టాలను పూరించేందుకు టికెట్ల రేట్లను పెంచడం, లేదా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడమే మార్గమని పలుమార్లు మెట్రో అధికారులు ప్రభుత్వానికి విజ్క్షప్తి చేసినట్టు తెలుస్తుంది. కరోనా సమయంలో ఏడాదిపాటు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో మెట్రోపై ఆర్థిక భారం ప్రారంభమై అది ప్రస్తుతం రూ.6,598 కోట్లకు చేరినట్టు సమాచారం. దీనికి తోడు మెట్రో నిర్మాణ సమయంలో తెచ్చిన అప్పులకు అధిక వడ్డీల చెల్లింపులకే ఎక్కువ శాతం కేటాయిస్తున్నట్టు మెట్రో అధికారులే పలుమార్లు చెప్పారు. అయితే, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం సుమారు 267 ఎకరాల భూమిని అందించింది.
ఈ భూమి మెట్రో స్టేషన్లు, డిపోలు, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్(టీవోడీ) కోసం ఉయోగించి ఆదాయం సమకూర్చుకోవాలి. అయితే, నాలుగైదు చోట్లనే ప్రభుత్వం ఇచ్చిన భూమిని మెట్రో డెవలప్ చేసి కమర్షియల్ కాంప్లెక్సులు కట్టినట్లు తెలుస్తుంది. 267 ఎకరాలను పూర్తిస్థాయిలో వినియోంచుకుంటే ఆర్థికభారం కొంతైనా తగ్గే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆస్తులను వదిలేసి టికెట్ల రేట్లు పెంచి జనాలను దోచుకోవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ప్రభుత్వ అనుమతి లేకుండానే ?
మెట్రో రైల్వే(ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002 ప్రకారం రేట్లను సవరించడానికి మెట్రో సిద్ధం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ చట్టం ప్రకారం మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ) ప్రారంభ చార్జీలను నిర్ణయించే అధికారం కలిగి ఉంటుంది. ఎల్ అండ్ టీ, మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెల్ (ఎంఆర్హెచ్ఎల్) హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కన్సెషనర్‌గా, ఎమ్ఆర్ఏగా వ్యవహరిస్తుంది. 2017లో ముంబై హైకోర్టు ముంబై మెట్రో రైల్ రేట్ల విషయంలో కన్సెషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగా హైదరాబాద్ మెట్రోలో ఎల్ అండ్ టీ కూడా రేట్ల నిర్ణయంలో స్వతంత్రతను పొందింది.
అయితే, మెట్రో స్వతంత్రంగా రేట్లను పెంచుకోవాలంటే ఫేర్ ఫిక్సేషన్ కమిటీ(ఎఫ్ఎఫ్సీ) సిఫారసు అవసరం. 2022లో మెట్రో టికెట్ రేట్లను పెంచాలని ప్రభుత్వాన్ని కోరినప్పుడు ఎఫ్ఎఫ్సీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇన్‌ఫ్లేషన్, హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్, ఎల్ అండ్ టీ ప్రతిపాదనలను అధ్యయనం చేసి.. 2023లో రేట్ల సవరణను సిఫార్సు చేసింది. ఎఫ్ఎఫ్సీ ఆమోదం పొందితే మెట్రో ధరల పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేకున్నా అమలు చేయవచ్చు. ఈ విధంగానే మెట్రో ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.