ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో-ఆర్టీసీ మంథ్లీ పాస్ రూ.4 వేలే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో-ఆర్టీసీ మంథ్లీ పాస్ రూ.4 వేలే
  • రూ.8,500 నుంచి రూ.4 వేలకు తగ్గింపు
  • ప్రయాణికులకు నెలకు రూ.4,500 ఆదా
  • డెయిలీ పాస్ రూ.400 నుంచి రూ.275కు
  • మెట్రోలో నెలకు 50 రౌండ్ ట్రిప్పులు
  • దీపావళి నుంచే కొత్త రేట్లు
  • మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో మెట్రో, ఆర్టీసీ మంథ్లీ పాస్​ధరను రూ. 8,500 నుంచి రూ. 4వేలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ ప్రజలకు దీపావళి కానుకగా ఈ ఉమ్మడి ప్రయాణ పాస్ రేట్లను తగ్గించినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తగ్గించిన ధరలు ఈ నెల 8న దీపావళి పండుగ నుంచే అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం నుంచి మెట్రోకు రూ. 3,000, ఆర్టీసీకి రూ. 1000 చొప్పున జమ కానున్నట్లు మంత్రి తెలిపారు. 

పాస్ ద్వారా బస్సుల్లో నెలంతా ఫ్రీగా తిరగవచ్చు.. కానీ, మెట్రోలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పుల వరకు అనుమతి ఉంటుందన్నారు. ఇక ప్రస్తుతం రూ. 400 ఉన్న డైలీ పాస్ ధరను రూ. 275 కు తగ్గించినట్లు మంత్రి వివరించారు. ఇందులో రూ. 200 మెట్రోకు, రూ. 75 ఆర్టీసీకి జమవుతాయని చెప్పారు.  ఈ పాస్ ద్వారా మెట్రోలో రోజుకు 4 సింగిల్ జర్నీలకు అనుమతి ఉంటుందన్నారు. ఈ తగ్గింపు ధరలతో ప్రయాణికులపై ప్రతి నెలా రూ. 4500,  డైలీ పాస్ తో రూ. 125 ఆదా అవుతాయని చెప్పారు. ప్రజల సంక్షేమం, ప్రయాణీకుల ఆర్థిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి  పొన్నం పేర్కొన్నారు.