V6 News

భారత్ చైనా దిగుమతులపై మెక్సికో టారిఫ్స్.. ట్రంప్ వ్యూహానికే జై!

భారత్ చైనా దిగుమతులపై మెక్సికో టారిఫ్స్.. ట్రంప్ వ్యూహానికే జై!

అగ్రరాజ్యం అమెరికా బాటలోనే మెక్సికో కూడా ముందుకెళుతోంది. ఆసియా దేశాలైన చైనా, భారత్, దక్షిణ కొరియా నుంచి దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలు తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోనూ ప్రధానంగా చైనా నుంచి వస్తున్న దిగుమతులను అడ్డుకోవడానికి మెక్సికో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 1,400కు పైగా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలను విధిస్తూ మెక్సికో సెనేట్ బుధవారం తుది ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల చైనా ఫ్యాక్టరీల నుంచి వచ్చే భారీ సరుకులకు అడ్డుకట్ట పడనుంది.

వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం, ఉత్పత్తుల ఆధారంగా 5 శాతం నుండి 50 శాతం వరకు సుంకాలు విధించనున్నారు. ప్రధానంగా దుస్తులు, మెటల్స్, ఆటో విడిభాగాలకు సంబంధించిన ఉత్పత్తులు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. చైనా, భారత్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉత్పత్తి చేయబడిన ఇన్‌పుట్‌లపై ఆధారపడే తయారీదారులు ద్రవ్యోల్బణాన్ని పెంచే ఖర్చులు పెరుగుతాయని హెచ్చరించారు. పాలక పార్టీతో సహా కొంతమంది చట్టసభ సభ్యులు పెరుగుతున్న ప్రాంతంతో వివాదాన్ని నివారించడానికి ప్రయత్నించారు. 

►ALSO READ | అమెరికాలో 'ట్రంప్ గోల్డ్ కార్డ్' వీసా: కోటీశ్వరులకు యూఎస్ డ్రీమ్స్ ఈజీ..

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ఈ చర్యలను స్థానిక పరిశ్రమల రక్షణ కోసమేనని చెబుతున్నప్పటికీ.. దీని వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. చైనా వస్తువులపై సుంకాలు పెంచడం ద్వారా అమెరికాను ప్రసన్నం చేసుకోవచ్చని మెక్సికో భావిస్తోందని తెలుస్తోంది. అమెరికా ఇప్పటికే చైనాపై వాణిజ్య యుద్ధం చేస్తోంది. మెక్సికో కూడా అదే బాట పట్టడం వల్ల అమెరికా-మెక్సికో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. చైనాపై టారిఫ్లు విధించడం ద్వారా, మెక్సికో నుంచి అమెరికాకు వెళ్లే స్టీల్, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై ఉన్న కఠినమైన అమెరికా సుంకాలను తగ్గించుకోవచ్చని మెక్సికో ఆశిస్తోంది.

వాస్తవానికి బయటి నుంచి చూసేవాళ్లకు చైనాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తున్నప్పటికీ.. ఇది మెక్సికో తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి అమెరికాతో ఆడుతున్న 'మైండ్‌ గేమ్' అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా దిగుమతులపై విధిస్తున్న ఈ 50% సుంకాలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి.