మెక్సికో టారిఫ్లపై తగిన చర్యలు తీసుకుంటం... మన ఎగుమతిదారుల ప్రయోజనాలు రక్షిస్తం: భారత్

మెక్సికో టారిఫ్లపై తగిన చర్యలు తీసుకుంటం... మన ఎగుమతిదారుల ప్రయోజనాలు రక్షిస్తం: భారత్
  • ఏకపక్షంగా సుంకాలు వేయడం కరెక్టు కాదని కామెంట్

న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై మెక్సికో విధించిన 50% టారిఫ్​లపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. మెక్సికో సుంకాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెక్సికోతో నిర్మాణాత్మకమైన చర్చలు జరుపుతూనే భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడుతామని, మన వాళ్ల ప్రయోజనాలు కాపాడే హక్కు ఇండియాకు ఉందని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. ఆదివారం పీటీఐతో ఆయన మాట్లాడారు. సుంకాల విషయంలో మెక్సికోతో ఇదివరకే భారత్  చర్చలు జరపడం ప్రారంభించిందని చెప్పారు. 

‘‘మెక్సికో ఆర్థిక శాఖతో భారత వాణిజ్య శాఖ ఉన్నత స్థాయి చర్చలు జరుపుతోంది. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేలా, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు కట్టబడి చర్చలు జరుపుతున్నారు. మెక్సికోతో భాగస్వామ్యాన్ని భారత్  గౌరవిస్తుంది. ఇరు దేశాల్లోని వ్యాపారులు, వినియోగదారులకు  ప్రయోజనం కల్పించే స్థిరమైన వాణిజ్య వాతావరణం కోసం మెక్సికోతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఆ అధికారి వెల్లడించారు. 

అయితే, ముందుగా భారత్​ను సంప్రదించకుండా ఏకపక్షంగా టారిఫ్​లు వేయడం కరెక్టు కాదని, ఇది పరస్పర సహకార ఆర్థిక స్ఫూర్తికి వ్యతిరేకం అని ఆ ఆఫీసర్  వ్యాఖ్యానించారు. కాగా.. భారత ఎగుమతులపై మెక్సికో విధించిన 50 శాతం సుంకాలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.