దసరాకు పల్లెబాట పట్టిన జనం.. కిక్కిరిసిన MGBS, JBS

దసరాకు పల్లెబాట పట్టిన జనం.. కిక్కిరిసిన MGBS, JBS

దసరా సెలవులు ముందుగానే వచ్చినా.. పండుగ కోలాహలం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. వీకెండ్ కావడం, మరో రొండు మూడు రోజుల్లో పండుగ ఉండటంతో హైదరాబాద్ నుంచి ప్రజలు స్వగ్రామాలకు బాట పట్టారు. కనీసం వారం రోజులు సెలవులు ఉండేలా చూసుకుని.. పిల్లా జల్లా సొంత గడ్డకు పయనమయ్యారు. దీంతో ఆదివారం (సెప్టెంబర్ 28) హైదరాబాద్ లోని ముఖ్యమైన బస్టాండ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. 

ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాంట్లు ప్రయాణికులతో నిండిపోయాయి. గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలతో MGBS బస్టాండు భారీ వరదతో మూసివేసిన విషయం తెలిసిందే. మూసీ వరదలు తగ్గడంతో ఆదివారం ఉదయంలోపే బురద మొత్తాన్ని శుభ్రం చేశారు. దీంతో బస్టాండు నుంచి బస్సు సేవలు ప్రారంభించడంతో ప్రయాణికులతో మళ్లీ ఎంజీబీఎస్ కళకళలాడుతోంది. 

దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు నడిపిస్తోంది ఆర్టీసీ. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు బస్సులు నడిపిస్తున్నారు. ఎంజీబీఎస్ వరకు కొందరు మెట్రోలో చేరుకుంటుండగా.. కొందరు ఆర్టీసీ బస్సుల్లో చేరుకుంటున్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల, అలంపూర్, గద్వాల, కొల్లాపూర్, 
శ్రీశైలం, కల్వకుర్తి, రంగారెడ్డి, వికారాబాద్, పరిగి, కొడంగల్ తదితర ప్రాంతాల ప్రాయాణికులు పెద్ద ఎత్తున చేరుకుంటుండటంతో బస్టాండు పూర్తిగా రద్దీగా మారిపోయింది.

►ALSO READ | గుడ్ న్యూస్ : TGPSC గ్రూప్- 2 ఫైనల్ రిజల్ట్ రిలీజ్

ఇటు JBS బస్టాండు కూడా ప్రయాణీకుల రద్దీతో కిక్కిరిపోతోంది. పండుగకు జనాలు ఊరిబాట పట్టడంతో జూబ్లీబస్ స్టేషన్ కు వేల సంఖ్యలో ప్రయాణికులు చేరుకుంటున్నారు. మెదక్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. తదితర ప్రాంతాల ప్రజలు జేబీఎస్ కు నగర వాసులు గ్రామాలకు వెళ్తుండటంతో సికింద్రాబాద్, జేబీఎస్, బేగంపేట రూట్లలో ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఇటు ఎల్బీ నగర్ బస్టాంటు కూడా ప్రయాణీకులతో రద్దీగా మారింది. విజయవాడ హైవే రూట్లలో వెళ్లే ప్రయాణికులు.. నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎల్బీ నగర్ బస్టాండుకు చేరుకుంటుండటంతో బస్టాండు రద్దీగా మారింది.