హైకోర్టు అడ్వకేట్లకు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి హైకోర్టు వరకు ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి టికెట్ అవసరం లేకుండా ఈ రూట్ లో నిర్దిష్ట సమయాల్లో అడ్వకేట్లు బస్సుల్లో రాకపోకలు సాగించవచ్చు. హైకోర్టు పనిచేసే అన్ని రోజుల్లో అడ్వకేట్లు ఉచిత బస్ సర్వీసులను వాడుకోవచ్చు. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఉదయం 9.40, 10.10, 10.40 గంటలకు హైకోర్టుకు బస్సులు బయలుదేరుతాయి.
ఇక హైకోర్టు నుంచి సాయంత్రం 4.30, 5.10, 5.40 గంటలకు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ కు బస్సులు బయలుదేరి వెళ్తాయి. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఈవిషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. అసోసియేషన్ సభ్యులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. దీనిపై హైకోర్టు ఈనెల 11న సర్క్యులర్ ను విడుదల చేసిందని వెల్లడించింది.
