
- సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 2,116 మంది ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు సంబంధించిన సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) బుధవారం విడుదల చేసింది. 1:1.5 నిష్పత్తిలో మొత్తం 2,116 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది. ఈ అభ్యర్థులు అక్టోబర్ 9 నుంచి 18 వరకు హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించింది.
అభ్యర్థులంతా తమ ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్లు వంటి ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకురావాలని స్పష్టం చేసింది. తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినా లేదా వెరిఫికేషన్‌కు హాజరు కాకపోయినా అభ్యర్థుల అర్హత రద్దు చేస్తామని బోర్డు హెచ్చరించింది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలెక్షన్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కాగా.. 2024 సెప్టెంబర్ 11న 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.