MI vs RR: సొంత ఇలాకాలోనూ ముంబై ఓటమి.. మరింత దిగజారిన ప్రతిష్ట

MI vs RR: సొంత ఇలాకాలోనూ ముంబై ఓటమి.. మరింత దిగజారిన ప్రతిష్ట

ఐపీఎల్‌లో ఐదు సార్లు చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్.. ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల మధ్య సమన్వయం లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇంకా గెలుపు రుచి చూసింది లేదు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలయ్యింది. 

సోమవారం(ఏప్రిల్ 1) వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘోర ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు విఫలమవ్వడంతో తొలుత 125 పరుగులకే పరిమితమైన ముంబై.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి శక్తికి శ్రమించినా సాధ్యమవ్వలేదు. స్వల్ప లక్ష్యాన్ని సంజూ శాంసన్ సేన ఆడుతూ పాడుతూ చేధించింది. 4 వికెట్లు కోల్పోయి మరో 27 బంతులు మిగిలివుండగానే ముగించింది. రియాన్ పరాగ్( 54 నాటౌట్; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు) పరుగులతో రాణించాడు. 

ఆదుకున్న పాండ్యా, తిలక్ వర్మ

అంతకుముందు రాజస్థాన్ బౌలర్లు విజృభించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది. హార్దిక్ పాండ్యా(34; 21 బంతుల్లో 6 ఫోర్లు), తిలక్ వర్మ(32; 29 బంతుల్లో 2 సిక్స్‌లు) పర్వాలేదనిపించగా.. రోహిత్ శ‌ర్మ(0), న‌మ‌న్ ధిర్‌(0), బ్రెవిస్‌(0), ఇషాన్ కిష‌న్‌(16) విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్ మూడేసి వికెట్లు తీసుకోగా.. నాండ్రే బర్గర్ 2, అవేష్ ఖాన్ ఒక వికెట్ సాధించారు.

ఇండియన్స్‌కు వరుసగా ఇది మూడో ఓటమి కాగా, రాజస్థాన్ రాయల్స్‌కు హ్యాట్రిక్ విజయం. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. ముంబై అట్టడుగు స్థానాన్ని నిలుపుకుంది.