Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొత్త హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియామకం జరగగా.. తాజాగా చెన్నై మేనేజ్‌మెంట్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎస్‌కేతో దశాబ్దానికు పైగా అనుబంధం ఉన్న స్టార్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ (Michael Hussey) తో ఫ్రాంచైజీ తెగతెంపులు చేసుకుంది. ఈ మేరకు హస్సీకి మేనేజ్‌మెంట్ అధికారికంగా సమాచారం అందించినట్లు తెలుస్తుంది.
15 ఏళ్ల సుదీర్ఘ బంధానికి తెర.. సీఎస్కే నుంచి హస్సీ ఔట్:
ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మైకేల్ హస్సీకి చెన్నై సూపర్ కింగ్స్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో ప్లేయర్‌గా రెండు సార్లు, కోచ్‌గా మరో మూడు సార్లు మొత్తం ఐదు టైటిల్స్ గెలవడంలో హస్సీ కీలక పాత్ర పోషించారు. ప్లేయర్‌గా చెన్నై తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన హస్సీ.. ముఖ్యంగా 2013 ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 733 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. ఆటగాడిగా, కోచ్‌గా దాదాపు 15 సంవత్సరాలకు పైగా సీఎస్‌కేతో ప్రయాణించిన హస్సీ.. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీని వీడటం అభిమానులను తీవ్ర విస్మర్యానికి గురిచేసింది. అయితే, ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఆయన ఇప్పటికే వేరే ఇతర ఫ్రాంచైజీల కోచింగ్ సిబ్బందితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
సీఎస్‌కే కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పులు:
ఐపీఎల్ 2027 సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ జట్టులో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. గత 18 సంవత్సరాలుగా హెడ్ కోచ్‌గా వ్యవహరించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) తో పాటు బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమోన్స్‌లను ఇప్పటికే ఫ్రాంచైజీ వదులుకుంది. ముఖ్యంగా ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ ఫాస్టర్ భవితవ్యం సైతం సందిగ్ధంలోనే ఉంది. కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్ రాగా, బౌలింగ్ కోచ్‌గా సీఎస్‌కే మాజీ పేసర్ మోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. హస్సీ స్థానంలో కొత్త బ్యాటింగ్ కోచ్ ఎవరవుతారనేది త్వరలోనే తేలనుంది. ఈ మార్పుల వెనుక సీఎస్‌కే లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
