ODI World Cup 2027: ఆస్ట్రేలియా, ఇండియా కాదు.. ఆ జట్టే వరల్డ్ కప్ గెలుస్తుంది: రెండేళ్ల ముందే ఇంగ్లాండ్ మాజీ జోస్యం

ODI World Cup 2027: ఆస్ట్రేలియా, ఇండియా కాదు.. ఆ జట్టే వరల్డ్ కప్ గెలుస్తుంది: రెండేళ్ల ముందే ఇంగ్లాండ్ మాజీ జోస్యం

సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. ఎప్పటిలాగే ఈ మెగా టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగడం ఖాయం. ఆతిధ్య దేశం కావడంతో సౌతాఫ్రికా జట్టుకు కొంత అడ్వాంటేజ్ ఉండనుంది. ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా రాణించే న్యూజిలాండ్ సైతం తొలిసారి టైటిల్ గెలవాలని ఆరాటపడుతోంది. ఈ మెగా టోర్నీకి ఇంకా రెండేళ్లు సమయం ఉన్నపటికీ అప్పుడే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వరల్డ్ కప్ విజేత ఎవరో జోస్యం చెప్పాడు. 

"సౌతాఫ్రికా 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను" అని వాన్  ఎక్స్ లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. సొంతగడ్డపై జరుగుతుండడం సఫారీలకు ఖచ్చితంగా కలిసి వచ్చేదే. ఇప్పటివరకు సౌతాఫ్రికా 1992, 1999, 2007, 2015, 2023లో వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్స్ ఆడింది. కానీ ఐదు సార్లు సెమీస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీటిలో మూడు సార్లు (1999, 2007, 2023) ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం ఆ జట్టును తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. వాన్ చెప్పనట్టు సౌతాఫ్రికా తమ మొదటి వన్డే  వరల్డ్ కప్ ను గెలుచుకుంటుందో లేదో చూడాలి. 

2027 వరల్డ్ కప్ లో ఈ సారి మొత్తం 14 జట్లకు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ మెగా టోర్నీ 2003 తరహాలో జరుగుతుందని స్పష్టం చేసింది. మొత్తం 14 జట్లు రెండు గ్రూప్ లుగా విభజించబడతాయి. గ్రూప్-ఏ లో ఏడు జట్లతో పాటు గ్రూప్-బి మరో ఏడు జట్లు లీగ్ మ్యాచ్ లు ఆడతాయి. రెండు గ్రూప్స్ లో టాప్- 3 లో నిలిచిన సూపర్-6 కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ లో ఒక్కో టీం మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున మొత్తం 5 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టాప్- 4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి. ఇక సెమీ ఫైనల్ లో గెలిచిన జట్లు రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి. 

2027 వన్డే ప్రపంచ కప్ విన్నర్ గురించి చెప్పిన ఈ ఇంగ్లాండ్ మాజీ.. 2025 మహిళల వన్డే ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంటుందని సపోర్ట్ తెలిపాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 2 వరకు గౌహతి, విశాఖపట్నం, ఇండోర్, నవీ ముంబై, శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్ లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. ఆతిధ్య దేశం కావడంతో ఇండియా తొలిసారి వరల్డ్ కప్ గెలుచుకుకోవాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది.